కలిసి పనిచేస్తేనే అభివృద్ధి


Tue,June 18, 2019 01:07 AM

-ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది
-ప్రజాప్రతినిధులుగా కొత్తచట్టానికి అనుగుణంగా పనిచేయాలి
-కలెక్టర్ శ్రీ దేవసేన
-ఐదో విడత హరితహారాన్ని పకడ్బందీగా చేపట్టాలి: ఎమ్మెల్యే దాసరి
-ట్రినిటీ కాలేజీలో పలు అంశాలపై సమీక్ష
కలెక్టరేట్ : కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమనీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజలను భాగస్వాములు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటి బీ-ఫార్మసీ కళాశాలలో సోమవారం హరితహారం, నీటి పొదుపు, స్వచ్ఛ్ భారత్ గ్రామీణ్, ఇంకుడుగుంతల నిర్మాణం తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే దాసరి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులంతా మనసుపెట్టి పనిచేస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని పేర్కొన్నారు. జనాల్లో కలిసి పని చేస్తేనే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఓట్లడిగేందుకు ఎలాగైతే ఇంటింటికీ తిరుగుతారో.. అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ గడపగడపకూ వెళ్లి ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. సీఎం ఆకాంక్షిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే గ్రామస్థాయి నుంచే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నారు.

అందుకు సర్పంచులు, గ్రామ స్థాయి అధికారులు కంకణబద్ధులు కావాలని కోరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొక్కలు నాటితే, వాటి సంరక్షణను అధికారులు గాలికొదిలేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఐదో విడత హరితహారాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. 5వ విడత హరితహారంలో 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు గల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకొని, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం కలెక్టర్ శ్రీదేవసేనకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మొక్క అందజేశారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా అటవీశాఖాధికారి రవిప్రసాద్ యాదవ్, ఈజీఎస్ పీడీ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...