మట్టి రవాణాపై కలెక్టర్ కన్నెర


Sat,June 15, 2019 02:55 AM

-ఇరిగేషన్ ఈఈ రమేశ్‌పై వేటు
-ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
-ఇచ్చిన అనుమతులూ నిలిపివేయాలని ఆదేశాలు
-అక్రమ మట్టి దందాను అడ్డుకోవాలి
-జిల్లా పాలనాధికారి
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అక్రమంగా సాగుతున్న మట్టి రవాణాపై కలెక్టర్ శ్రీదేవసేన ఉక్కుపాదం మోపారు. నెల రోజులుగా చెరువులు, కుంటల నుంచి రాత్రీపగలూ తేడా లేకుండా తరలిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై కలెక్టర్ శ్రీదేవసేన కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మట్టి రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఈ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలనీ, అక్రమ మట్టి రవాణాను పూర్తి స్థాయిలో నివారించాలని ఆదేశించారు. సత్వర చర్యలకు దిగి, వర్షాలు కురిసే దాకా జిల్లాలో మట్టి రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతేడాది మట్టి రవాణాలో పలు అక్రమాలు జరిగాయనీ, దాన్ని నివారించేందుకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా ప్రణాళిక రూపొందించినా, అమలు చేయడంతో అధికారులు విఫలమయ్యారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మట్టి అక్రమ రవాణాను అడ్డుడకోవడంతోపాటు చెరువులకు హద్దులు వేయడంలో అలసత్వం ప్రదర్శించారని నీటి పారుదల శాఖ ఈఈ రమేష్ బాబుపై వేటు వేశారు.

ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేయడంతోపాటు సస్పెండ్ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సిపారస్సు చేశారు. ప్రస్తుతం జిల్లాలో మట్టి రవాణాకు ఇచ్చిన అన్ని అనుమతులను తక్షణమే రద్దు చేయాలనీ, ఆర్డీఓల ఆధ్వర్యంలో కొత్తగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ మట్టి రవాణాతో ప్రభుత్వ ఖజానాకు గండి పడడంతోపాటు పర్యవరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని స్పష్టం చేశారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల దాకా మట్టి రవాణాకు అనుమతిస్తే, 24గంటలపాటు అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి సాయంత్రం 6గంటల తర్వాత మట్టిని తరలిస్తే వాహనాలను సీఈజ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి మట్టి రవాణా ప్రతి లారీని తాసిల్దార్‌తోపాటు మైనింగ్ ఏఈ ధ్రువీకరించిన తర్వాతే మట్టిని తరలించాలని చెప్పారు. విధులను నిర్లక్ష్యం చేసే అధికారులపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వారం, పది రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్తంగా కృషి చేసి, మట్టి అక్రమ రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. దీంతోపాటు ఇప్పటిదాకా జిల్లాలో ఎక్కువ మట్టి తరలించిన 12చెరువులకు సంబంధించి హద్దులను నిర్ణయించాలనీ, రేపటిలోగా పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని చెరువు మట్టిని ముందుగా రైతులకు ఇచ్చిన తర్వాతే వ్యాపారులకు ఇవ్వాలని చెప్పారు. మట్టి అనుమతి ఇచ్చిన ప్రతి చోటా మూడు షిప్టుల్లో 24గంటల పాటు పోలీసులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్ గౌడ్, పెద్దపల్లి, మంథని ఆర్డీఓలు ఉపేందర్ రెడ్డి, నగేష్‌తోపాటు నీటి పారుదల శాఖ అధికారులు, తాసిల్దార్లు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...