ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Thu,June 13, 2019 03:47 AM

-డీఈఓ వెంకటేశ్వర్‌రావు
-రంగాపూర్ గ్రామ శివారు శ్రీరాంనగర్‌లోని పాఠశాల పునఃప్రారంభం
-విద్యార్థులకు పుస్తకాల అందజేత
కలెక్టరేట్: గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామశివారులోని శ్రీరాంనగర్‌లో మూడేళ్ల క్రితం విద్యార్థులు రాక మూతపడిన ప్రభుత్వ పాఠశాలను బుధవారం డీఈఓ చేతుల మీదుగా పునఃప్రారంభించారు. శ్రీరాంనగర్ ప్రాథమిక పాఠశాలలో గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండి విద్యార్థులు చదువుకోవడానికి ఆసక్తి చూపక ఇక్కడి విద్యార్థులంతా సమీప ప్రాంతాలుగా ఉన్న కమాన్‌పూర్, పేరపల్లి, రొంపికుంట, పెద్దపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లడంతో పాఠశాల మూతపడింది. దీంతో ఇక్కడ విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధిత అధికారులు రంగాపూర్ గ్రామంలోని పాఠశాలకు పంపించారు. అప్పటి నుంచి అక్కడే విద్యాబోధన చేస్తున్న శ్రీరాంనగర్ పాఠశాల హెచ్‌ఎం బీ అనిల్ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామస్తుల సహకారంతో శ్రీరాంనగర్‌తోపాటు పరిసర గ్రామాలకు చదువుకోసం వెళ్తున్న విద్యార్థులను చైతన్యపరుస్తూ ఈ విద్యా సంవత్సరంలో తిరిగి 27 మంది విద్యార్థులతో శ్రీరాంనగర్‌లోనే పాఠశాలను ప్రారంభించేలా కృషి చేశారు. పాఠశాల ప్రారంభానికి సరిపడే విద్యార్థులు పాఠశాలలో చేరడంతో వారికి పుస్తకాలను అందజేసి సరస్వతీ చిత్రపటం ఎదుట జ్యోతి వెలిగించి చిత్రటానికి పూలమాల వేసి పాఠశాలను పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా డీఈఓ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వం పేదవర్గాలకు విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరిగేలా చూస్తుందన్నారు. మూడేళ్ల క్రితం మూతబడిన పాఠశాలను తిరిగి పునః ప్రారంభంచేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులను డీఈఓ అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పునఃప్రాంభమైన పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, అందుకు గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బాలికా సంరక్షణ అధికారి పద్మ, పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్, హెచ్‌ఎంలు రాగమయి, అనిల్‌ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కోండ శ్రీధర్, ఉపాధ్యాయులు రమాదేవి, తిరుపతి, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజు, మెగాబ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు సముద్రాల రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ గండు లస్మయ్య, వార్డుసభ్యులు మేకల కుమార్ యాద వ్, రాసమల్ల విజయ్, నరేశ్, వేణుతోపాటు పలు వురు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...