ఎట్టకేలకు చిక్కిన పనకంటి


Wed,June 12, 2019 01:19 AM

- సోమవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసు ప్రత్యేక బృందం
- ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అప్పట్లో అక్రమ వసూళ్లు
- ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
- మోసం బయటపడడంతో నాలుగేళ్లుగా పరారీలో
- మంథని కోర్టులో హాజరు.. 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- బాధితులు ఇంకా ఉంటే ఫిర్యాదులు చేయాలి: మంథని సీఐ మహేందర్
మంథని, నమస్తే తెలంగాణ: మంథని ప్రాంతంలో 30ఏళ్ల పాటు ఏక ఛత్రాధిపత్యాన్ని చెలాయిస్తూ అధికారం చాటున అందిన కాడికి దోచుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ, నాలుగేళ్లుగా పరారీలో ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మంథని పోలీసుల ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. మంగళవారం మంథని పోలీసు స్టేషన్‌లో నింధితుడు చంద్రశేఖర్ మీడియాకు కనిపించగా, అనంతరం చంద్రశేఖర్‌ను మంథనిలో కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మంథని సీఐ ఆకునూరి మహేందర్ విలేకరులతో వివరాలు వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో పనకంటి చంద్రశేఖర్ జమ్మికుంట మండలం చిన్నకోమటి పల్లికి చెందిన ముక్కా మహేశ్‌కు ఉద్యోగం పెట్టిస్తానని రూ. 5లక్షలు వసూలు చేశాడనీ, ఉద్యోగం ఇవ్వకపోగా, డబ్బుల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పేర్కొన్నారు. అలాగే గోదావరిఖనికి చెందిన మీర్జా అహ్మద్‌బేగ్ అనే వ్యక్తి వద్ద సైతం ఉద్యోగం పెట్టిస్తానని నమ్మించి రూ. 4లక్షలు వసూలు చేశాడనీ, సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లికి చెందిన ఆసరి అనీల్ అనే వ్యక్తి వద్ద సైతం జెన్‌కోలో ఉద్యోగం పెట్టిస్తానని రూ. 5లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు చంద్రశేఖర్‌పై మంథని ఠాణాలో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ముక్కా మహేశ్ ఫిర్యాదు మేరకు ఆ కేసులో గోదావరిఖనికి చెందిన కన్నూరి సత్యనారాయణను 11.03.2016న అరెస్టు చేశామని చెప్పారు.

కానీ పనకంటి చంద్రశేఖర్ మాత్రం పరారీలో ఉండి తప్పించుకొని తిరుగుతున్నాడనీ, ఈ క్రమంలో చంద్రశేఖర్‌పై మంథని కోర్టులో చార్జీషీటు దాఖలు చేయగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని వివరించారు. ఈ క్రమంలో రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆయన ఆచూకీ కోసం గాలిస్తుండగా సోమవారం రాత్రి 10గంటల ప్రాంతంలో అరెస్టు చేసి మంథని కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ వివరించారు. కాగా, చంద్రశేఖర్‌కు మంథని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. గత కాంగ్రెస్ హయాంలో అధికారం చాటున భారీగా అక్రమాలకు పాల్పడ్డాడనే అనేక ఆరోపణలు, ఉద్యోగాల పేరిట మోసం చేశారనే కేసులున్న చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరారీలో ఉన్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నట్లుగా ఆయన అనుచరుల ద్వారా ప్రచారం చేసుకుంటూ బాధితుల నుంచి, పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు పోలీసులు పనకంటి చంద్రశేఖర్‌ను అరెస్టు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

ఇంకా బాధితులు ఉంటే సంప్రదించాలి: సీఐ మహేందర్
కరీంనగర్ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చని మంథని సీఐ ఆకునూరి మహేందర్ తెలిపారు. ఎవరూ ఎలాంటి అపోహలకు పోకుండా నేరుగా వచ్చి తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులకు పోలీసు శాఖ అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు.

ఫిర్యాదులకు కదులుతున్న బాధితులు
అక్రమ వసూళ్లకు తెగబడి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పనకంటి చంద్రశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కగా, అతని ద్వారా మోసపోయిన పలువురు బాధితులు ఫిర్యాదు చేసేందుకు కదులుతున్నారు. గత పాలకుల హయాంలో మంథని నియోజకవర్గంలో అన్నీ తానై నడిపించి అటు సొంత పార్టీ వారిని, ఇతర వర్గాల వారినీ, అధికారులను, ప్రజా ప్రతినిధులను మోసం చేశాడని పనకంటి చంద్రశేఖర్‌పై మంథని పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కాగా, ప్రైవేటు కేసులూ నడుస్తున్నాయి. గతంలోనే బాధితులు ఠాణా మెట్లెక్కి కేసులు పెట్టగా అప్పటి నుంచి ఆయన మంథని దరిదాపుల్లోకి రాకుండా బాధితులకు చిక్కకుండా రహస్యంగా ఉంటున్నాడు. కానీ ఆయన ఆచూకీ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన రామగుండం కమిషనరేట్ పోలీసులు, ఒక విందులో పనకంటి పాల్గొన్నాడని తెలిసి అలర్టయ్యారు. వెంటనే పోలీసు ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు చేరుకొని అదుపులోకి తీసుకుంది. విషయం ఆనోటా.. ఈ నోటా పడి వైరల్ కావడంతో మంగళవారం రోజున పనకంటి బాధితులు మంథని పోలీసు స్టేషన్‌కు, కోర్టు ఆవరణకు చేరుకున్నారు. తమ వద్ద వసూలు చేసిన డబ్బులను ఇప్పించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...