ప్రభుత్వ బడుల రక్షణే లక్ష్యంగా..


Wed,June 12, 2019 01:19 AM

-గ్రామగ్రామాన బడిబాట
-ఇంటింటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులు
-విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కసరత్తు
-నేటి నుంచి విద్యాలయాల ప్రారంభం
కాల్వశ్రీరాంపూర్ : ప్రభుత్వ బడుల సంరక్షణే లక్ష్యంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామగ్రామాల పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యాలయాల్లో అందిస్తున్న సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో 27 ప్రాథమిక, ఆరు ప్రాథమికోన్నత, 11 జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల్లో కలిపి గత విద్యాసంవత్సరం మొత్తం 2810 విద్యార్థులు చదివారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని బడిబాట పేరిట ఇప్పటికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడీడు పిల్లలను విద్యాలయాల్లో చేర్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామాల్లో మంచి స్పందన వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.

సౌకర్యాలు వివరిస్తూ..
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూళ్ల టీచర్ల మాదిరిగానే ఆయా గ్రామాలకు ఉదయం 6 గంటలకే చేరుకుంటున్నారు. దాదాపు ఉదయం 10 గంటల దాకా ఇంటింటికీ తిరుగుతూ పాఠశాలలపై వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఉత్తమ విద్యార్థులకు ఉపకార వేతనాలు, మధ్యాహ్నం భోజనం తదితర సౌకర్యాలపై వివరిస్తున్నారు. అలాగే అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు గుణాత్మక విద్యాబోధన అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుపుతున్నారు. ప్రైవేటు కంటే మెరుగైన బోధన అందిస్తామని ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ఆయా ప్రభుత్వ విద్యాలయాల్లో 10 తరగతి విద్యార్థులు చూపిన ప్రతిభను కరపత్రాల్లో ముద్రించి గ్రామ గ్రామాన తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. గత సంవత్సరం అన్ని పాఠశాలల్లో 10వతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారనీ, ఈ విద్యా సంవత్సరంలో కూడా మెరుగైన విద్యాబోధన చేసేందుకు తామంతా సిద్ధమని విద్యార్థుల తల్లి దండ్రులకు వివరిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాలు ప్రారంభమవుతున్నాయి.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...