హరితహారానికి సిద్ధం కావాలి


Wed,June 12, 2019 01:19 AM

-ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేయండి
-విజయవంతానికి ప్రత్యేక కృషి చేయాలి
-కలెక్టర్ శ్రీదేవసేన
-అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష
కలెక్టరేట్: ఐదో విడత హరితహారానికి అంతా సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. ఐదో విడత హరితహారం కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లోని ప్రతి వీధిలో మొ క్కలు నాటాల్సిన అవసరం ఉందనీ, వాటి సంరక్షణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని అధికారులను ఆదేశించారు. ఆయా మున్సిపాలిటీల్లో అంతర్గత రహదారుల వెంట మొక్కలు నాటేందుకు అవసరమైన సంఖ్య వివరాలను తెలియజేయాలని సూచించారు. జిల్లా ప్రారంభం నుంచి ముగిసే వరకు సుమారు 60 కిలో మీటర్ల మేర రాజీవ్ రహదారి ఉందని రోడ్డు మధ్యలో మొక్కలు నాటి చెట్లను పెంచే కార్యక్రమాన్ని జాతీయ రహదారి ఏజెన్సీలు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్‌లో రాజీవ్ రహదారి మ రింత విస్తరణ జరిగే అవకాశమున్న నేపథ్యంలో దానిని దృష్టిలో పెట్టుకొని పాత మట్టిని తొలగించి కొత్తది పోసి దూరంగా నాటాలన్నారు.

రాజీవ్ రహదారి వెంట సుమారు 64వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామనీ, వాటిని సంరక్షించే బాధ్యతను పూర్తి స్థాయిలో జిల్లాలోని వివిధ పారిశ్రామిక ఏజెన్సీలకు అప్పగించామని వివరించారు. రాజీవ్ రహదారి వెంట మొక్కలు పెంచడం కోసం ఆరు భాగాలుగా విభజించామనీ, సింగరేణి సంస్థ వారు పెద్దపల్లి నుంచి శివపల్లి వరకు 12 కిలోమీటర్లు, ఎన్టీపీసీ వారు శివపల్లి నుంచి పెద్దకల్వల వరకు 12 కిలో మీటర్లు, సింగరేణి రామగుండం వారు పెద్దకల్వల నుంచి బందంపల్లి వరకు 12 కిలోమీటర్లు, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థ వారు బందంపల్లి నుంచి కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వరకు, కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కుందనపల్లి వరకు, ఎన్టీపీసీ సంస్థ కుందనపల్లి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువల వెంట, చెరువు కట్టల వెంట మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీల్లో నాటే మొక్కలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు అందించాలనీ, పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీల్లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. జూన్ చివరి నాటికి హరితహారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారులు అక్భర్, సురేందర్ పాండే, జిల్లా అటవీశాఖాధికారి రవిప్రసాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, పెద్దపల్లి ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఎన్టీపీసీ అధికారి పుష్పేందర్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...