రైతు బంధు వచ్చేసింది


Tue,June 11, 2019 02:59 AM

-ముచ్చటగా మూడోసారి పెట్టుబడి
-ఈ సీజన్ నుంచి ఎకరాకు 5వేలు
-తాజాగా జిల్లాకు 127.50కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
-జిల్లాలో 1,20,644 మంది రైతులకు ప్రయోజనం
-రంగంలోకి అధికారయంత్రాంగం
-విడతల వారీగా కర్షకుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుల పెట్టుబడులు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు మరోసారి వచ్చేసింది. ఇప్పటికే రెండు సార్లు సాయం అందించిన సర్కారు ముచ్చట మూడో సారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 1,20,644 మంది రైతులు ఉండగా, తాజాగా ప్రభుత్వం రూ. 127.50కోట్లు విడుదల చేసింది. వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

ఈ సీజన్ నుంచి ఎకరాకు 5వేలు..
రైతు బంధును గతేడాది వానాకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా, అప్పుడు ఎకరాకు రూ.4వేలు అందజేశారు. గత యాసంగి పెట్టుబడులకూ ఎకరానికి రూ. 4 వేలు అందజేశారు. అయితే ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ వచ్చే వానాకాలం నుంచి పెట్టుబడి సాయాన్ని పెంచుతామనీ, ఎకరాకు రూ. 5వేలు అందజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో ఇచ్చిన మాట ప్రకారం ఈ వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ. 5వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

జిల్లాకు రూ.127.50కోట్లు విడుదల
గతేడాది వానాకాలం నుంచి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్న సర్కారు ఈ ఏడు తొలకరికి ముందుగా ఇచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. గత వానాకాలంలో జిల్లాలో 1,11,221 మంది రైతులకు రూ. 95.28 కోట్లు అందించగా, కొన్ని కారణాల రీత్యా యాసంగిలో 97,114మందికి రూ.88.4కోట్లు మాత్రమే జమ చేశారు. అయితే ఇటీవలి కాలంలో మరికొంత మంది పట్టాదారు పుస్తకాలు అందుకోవడంతో రైతుల సంఖ్య మొత్తం 1,20,644కు చేరగా, వీరందరికీ పెట్టుబడి కోసం ప్రభుత్వం రూ.127.50కోట్లను విడుదల చేసింది.

త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు..
వానాకాలంలో పంట పెట్టుబడికి ప్రభుత్వం ముందుగానే రూ. 127.50కోట్లు విడుదల చేయడంతో జిల్లాలోని రైతులు, రైతు సమన్వయ సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హమీలో భాగంగా ఎకరాకు పెట్టుబడి సాయం రూ. 5వేల చొప్పున అందించడానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేసుందులవిడుతల వారిగా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఏ మండలంలో ఎంత సాయం..
జిల్లాలో 14 మండలాలు ఉండగా, పెట్టుబడి సాయం అందుకునే రైతుల వివరాలు ఇలా ఉన్నా యి. రామగుండం మండలంలోని 1,669మంది రైతులకు రూ.1,40,91,053, పాలకుర్తిలో 6,858 మందికి రూ. 7,22,07,980, ధర్మారంలో 13, 609 మందికి రూ. 13,43,14,460, అంతర్గాంలో 4, 455మందికి రూ. 4,75,09, 615, సుల్తానాబాద్‌లో 13,444 మందికి రూ. 13, 18, 46, 823, కాల్వశ్రీరాంపూర్‌లో 11,056 మందికి రూ. 12,48, 86,778, పెద్దపల్లిలో 16,438 మందికి రూ. 16, 49,37,112, ఓదెలలో 11, 405 మందికి 12,96,81,503, జూలపల్లిలో 8,035 మందికి రూ. 7, 99,46,008, ఎలిగేడులో 5,549 మందికి 6,22,00, 874, రామగిరిలో 4,888 మందికి రూ. 5,40, 78,919, ముత్తారంలో 6,670 మందికి రూ.7,34,18,488, మంథనిలో 12,189 మందికి రూ. 14,56, 72,159, కమాన్‌పూర్ మండలంలోని 4,379 రైతులకు సంబంధించి రూ. 4,02 ,54,872 పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...