రోళ్లు పగిలేలా.. రోహిణీ కార్తె


Mon,May 27, 2019 02:17 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా నిప్పుల కొలిమిలా మండుతోంది. ఈ నెల లో నాలుగైదేళ్లలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్టంగా 47.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రతకు పిట్టల్లా రాలుతున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 21 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. 2016 మే తర్వాత ఈ నెలలోనే వడగాలులు ఎక్కువ రోజులు వీస్తున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. కరీంనగర్‌లో బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఈ నెల 25న రోహిణీ కార్తె ప్రవేశించడంతో ఎండల ప్రభావం మరింతగా పెరిగింది. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు..

మూడేళ్లలో ఇదే అధికం
ఎండల తీవ్రత ఏటేటా పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. 2016 కంటే ఈసారి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఏడాది 27 రోజులు వడగాలులు వీచిన రికార్డు ఉంది. 2017-18లో ఎండల తీవ్రత కనిపించినా వడగాలులు తక్కువ రోజులు వీచాయి. ఉష్ణోగ్రతలు పెరిగినా జనం తట్టుకోగలిగారు. 2016 తర్వాత ఈ ఏడాది ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా అటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బతో జనం మృత్యువాత పడుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 25 మంది వడదెబ్బతో మరిణించారు. 2016లో ఈ నెలలో గరిష్టంగా 44 డిగ్రీలు మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది మే నెల ప్రారంభంలోనే 43 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 1న 43.8, 2న 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మధ్యలో కాస్త తగ్గినా ఈ నెల 20 నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. 20 నుంచి 24 వరకు 44 డిగ్రీలకు పైగా నమోదుకాగా 25న 47.0, 26న 47.5 డిగ్రీల చొప్పున రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది.

పెరుగుతున్న వడగాలుల ప్రభావం
గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడు వారం రోజులుగా వడగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఈ నెలలో అడపాదడపా అకాల వర్షాలు కురిసినా వాతావరణంలో మార్పులు కనిపించడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండంతో రాత్రి వేళలోనూ వేడి గాలులు ప్రభావం చూపుతున్నాయి. 2009 మే నెలలో 17, 2010లో 16, 2012లో 15, 2013లో 13, 2015లో 13 రోజులు వడగాలులు వీ చినట్లు రికార్డులు నమోదయ్యాయి. అయితే 2016లో 27 రోజులు వీచిన వడగాలులే ఈ ఐదారేళ్లలో ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా 2016ను పోలిన వాతావరణమే కనిపిస్తోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఉష్ణోగ్రతల్లో మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2016లో ఎక్కువ రో జులు వడగాలులు వీచినా గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ ఏడాదిలాగా అత్యధికంగా నమోదు కాలేదు. 2016 మే 26న గరి ష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకే పరిమితంకాగా ఈ ఏడాది 47 డిగ్రీల నమోదు కావడం విశేషం. గతేడాది ఇదే రోజు 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. అంతే ఏడాదిలో 4.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గంటకు 11 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో ప్రతి రోజు వడగాలులు వీస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత అధికంగా కనిపిస్తోంది. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావంతో జనం మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే 21 మంది మరణించారు.

జాగ్రత్తలు పాటించాలి
మరో మూడు రోజులు వడగాలుల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బతో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ.50 వేల పరిహారం చెల్లిస్తుందని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎండ తీవ్రత నుంచి తమను తాము రక్షించుకోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. వివిధ శాఖల భాగస్వామ్యంతో వేసవి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలు ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకే పనులు ముగించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వడదెబ్బ బారిన పడ్డ వారికి తక్షణమే తగిన చికిత్స అందించాలని కోరుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. వడదెబ్బ సోకిన వారికి తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల సెలవులను కూడా జూన్ 12 వరకు పొడిగించారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...