నిప్పుల కుంపటి


Sun,May 26, 2019 03:01 AM

-జిల్లాలో భానుడి ఉగ్రరూపం
-వారం రోజుల నుంచి ప్రతాపం
-గరిష్ఠంగా 47డిగ్రీలు నమోదు
-ఉదయం 9 గంటల నుంచే మండుతున్న ఎండ
-మధ్యాహ్నానికి నిప్పుల వర్షం
-అగ్నిగుండంలా రామగుండం
-వడదెబ్బతో 20 మంది మృతి
-శనివారం ఒకరోజే ఇద్దరి మృత్యువాత
-అప్రమత్తం కావాలంటున్న అధికారులు

సూర్య ప్రతాపానికి జిల్లా అగ్నిగోళంలా మారుతున్నది. వారంరోజులుగా ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు భగ్గుమంటుండగా, మధ్యాహ్నంకల్లా నిప్పుల వర్షం కురుస్తున్నది. ఎండ తీవ్రతకు జనం ఇళ్లకే పరిమితమవుతుండగా, శ్రమజీవులు పిట్టల్లా రాలుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. శనివారం గరిష్ఠంగా రికార్డు స్థాయిలో 47 డిగ్రీలు నమోదు కాగా, తట్టుకోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారయంత్రాంగం హెచ్చరిస్తున్నది.

కలెక్టరేట్/మంథని, నమస్తే తెలంగాణ/ గోదావరిఖనిటౌన్/రామగిరి: జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. రోజురోజుకూ భానుడి ప్రతాపంతో నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అంబటాళ్ల నుంచే నిప్పుల వర్షం కురుస్తున్నది. శనివారం గరిష్ఠంగా 47 డిగ్రీలకు చేరుకోవడం, పగలూ రాత్రి తేడాలేకుండా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు, శ్రామికులు తల్లడిల్లుతున్నారు.

47 డిగ్రీల నమోదు..

శనివారం రోహిణీ కార్తె ప్రారంభం కాగా, ఎండ దంచికొట్టింది. గత వారం రోజులుగా 45, 46 డిగ్రీలుగా నమోదవుతున్న ఎండ శనివారం గరిష్టంగా 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో మరింతగా ముదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉదయం 8 గంటలకే వాతావరణంలో వేడి మొదలవుతున్నది. తొమ్మిది, పది గంటలకల్లా ఇక ఇండ్లల్లో నుంచి కదలలేని పరిస్థితిలో మండిపోతున్నాయి. ఇటు వేడితోపాటు వడగాలులతో పల్లె, పట్టణం తేడా లేకుండా అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటల తర్వాత రోడ్లపైకి వచ్చేందుకే జనం జంకుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు వేసుకున్నా ఉక్కపోత నుంచి తగ్గకపోవడంతో ఉపశమనం కోసం శీతలపానీయాలతో ఉపశమనం పొందుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలైతేనే పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, మంథని పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, చిన్నచిన్న దుకాణాలను కూడా మధ్యాహ్నం మూసి ఉంచుతున్నారు.

అగ్నిగుండంలా కోల్‌బెల్ట్..

కోల్‌బెల్టు పారిశ్రామిక ప్రాంతం భగభగ మండుతున్నది. రెండు మూడు రోజుల నుంచి ఎండలు భీకరం దంచికొడుతుండగా, సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి కాస్త అంతరాయం ఏర్పడుతున్నది. రామగుండం రీజీయన్ పరిధిలోని ఒక్కో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో సాధారణంగా రోజుకు 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెలికితీస్తుంటారు. కానీ, ఎండ ప్రభావం వల్ల కార్మికులు తమ విధులకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీంతో ఓసీపీల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. కాగా, తమ పనివేళలు మార్చాలని కార్మికులు అధికారులను కోరుతున్నారు.

వడదెబ్బతో 15 మంది మృతి..

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శ్రమజీవులు అల్లాడిపోతున్నారు. కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 10 నుంచి ఇప్పటి వరకు వడదెబ్బతో 20మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువగా రైతులు, కూలీలు, రోజువారీ పనులు చేసుకునే శ్రమజీవులే ఉండడం కలవరపెట్టిస్తున్నది. కాగా, శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మృతిచెందారు. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన దొమ్మటి రాజమ్మ(48) ఉదయం పొలంలో పనికి వెళ్లి, తీవ్ర అస్వస్థతకులోనై, మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన జంగపెల్లి పోశం (65) వడదెబ్బతో మృతి చెందాడు. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు ఆరు లీటర్లకుపైగా నీరు తాగాలనీ, ఉదయం సాయంత్రం రెండు సార్లు స్నానం చేయాలని చెబుతున్నారు.

పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు..

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లాలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇండ్లు, గుడిసెలు, చెట్లు దగ్ధమవుతున్నాయి. పదిరోజులుగా ఈ ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోగా, మంథని, పెద్దపల్లి, రామగుండం ఫైర్ సిబ్బంది ప్రతీ రోజు ప్రమాదాలను ఆర్పివేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల గోదావరిఖని నగర నడిబొడ్డున గాంధీనగర్ వంక పంపు వద్ద టాటాస్కైకు చెందిన ఓమ్నీ వ్యన్ షాట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇటీవల మంథని ఫైర్ స్టేషన్ పరిధిలో.. ముత్తారం మండలం మైదంబండలో అరటితోట, మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో, రామగిరి మండలం కల్వచర్లలో తాటి, ఈత వనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కమాన్‌పూర్ మండలం రొంపికుంటలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం దగ్ధంకాగా, ఆటో కాలిపోయింది. సుల్తానాబాద్ మండలం హరిపురంలో కోసిన పొలాల్లోని వరిగడ్డి, మోటార్లు కాలిపోయాయి. 500 ఎకరాల్లోని పశు గ్రాసం దగ్ధమైంది. 100వరకు మోటార్లు, పైపులు కాలిపోయాయి.

గత పది రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..

తేదీ గరిష్టం కనిష్టం
16 44.5 27.5
17 45.0 27.9
18 45.2 27.4
19 45.8 27.5
20 45.1 26.9
21 44.6 27.2
22 45.2 28.5
23 45.8 26.8
24 44.8 26.6
25 47.0 30.0

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...