వడదెబ్బతో ఇద్దరి మృతి


Sun,May 26, 2019 02:42 AM

కాల్వశ్రీరాంపూర్: మండలంలోని కూనారం గ్రామానికి చెందిన దొమ్మటి రాజమ్మ(48) అనే మహిళ శనివారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, రాజమ్మ శనివారం ఉదయం అదే గ్రామంలో ఓ రైతు పంటపొలంలో పసుపు తీసుకునేందుకు వెళ్లింది. ఎండలో పని చేసిన రాజమ్మ ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. కొంత సేపటికి మంచినీళ్లు తాగిన రాజమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. రాజమ్మ అవివాహితురాలు కాగా, తల్లి చెండాంబతో కలిసి ఉంటోంది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ డొంకెన విజయ కోరారు.

-కమాన్‌పూర్‌లో
కమాన్‌పూర్: మండలకేంద్రానికి చెందిన జంగపెల్లి పోశం (65) అనే వ్యక్తి శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతకు పోశం అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతడు మృతిచెందాడు. పోశం గతంలో కమాన్‌పూర్ టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా పని చేసి నాలుగు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందాడు.

-అగ్ని ప్రమాదంలో విత్తన పసుపు దగ్ధం
ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదంలో విత్తనపు పసుపు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గుజ్జె చిన్న రాజం గ్రామ శివారులోని తుమ్మల చెరువు సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఐదు కడాయిల విత్తన పసుపు ఖరీఫ్ సాగుకు నిల్వ ఉంచుకోగా, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దీంతో సుమారు రూ.15వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

-బుల్లి కూలర్‌తో కూల్.. కూల్..
గోదావరిఖని టౌన్ : ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు గోదావరిఖనికి చెందిన దుంపటి వినయ్ అనే యువకుడు ఓ వినూత్న ఆలోచన చేశాడు. డబ్బులు పెట్టి ఏసీలు.. కూలర్లు కొనుక్కోలేని అతడు.. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ బుల్లి కూలర్‌ను తయారు చేసి, ఔరా అనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసిన వినయ్, కళ్యాణ్‌నగర్‌లో తోపుడుబండి పెట్టుకొని కొబ్బరిబోండాలు అమ్ముకుంటున్నాడు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉక్కపోత భరించలేక వాడి పడేసిన నూనె డబ్బాలు, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువు (ఫ్యాన్), బ్యాటరీ సహాయంతో తానే స్వయంగా ఓ బుల్లి కూలర్‌ను తయారు చేశాడు. దాన్ని తన తోపుడు బండిపై ఉంచి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నాడు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...