చలువ పందిరి.. మొక్కలకు ఊపిరి..


Sun,May 26, 2019 02:41 AM

-నర్సరీలకు రక్షణ కల్పిస్తున్న అధికారులు
-మొక్కలు ఎండిపోకుండా గ్రీన్‌నెట్‌షెడ్లు
-హరితహారాన్ని పక్కాగా చేపట్టేందకు ప్రణాళికలు

ముత్తారం : వన నర్సరీల్లో పెంచుతున్న మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా, గ్రీన్‌నెట్ షెడ్లను ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా 100 శాతం మొక్కలు నాటేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న అధికారులు, ఇందుకోసం నర్సరీల్లోని మొక్కలను మొదట్నుంచీ కాపాడుకుంటూ వస్తున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన 17 వననర్సరీల్లో ఎంపీడీవో మంత్రి మణికంటేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రీన్‌నెట్ షెడ్లతోపాటు మొక్కలకు నిత్యం నీళ్లు పడుతూ వాడిపోకుండా కాపాడుతున్నారు. ఏపీఓ దయమణి ఎప్పటికప్పుడు వన నర్సరీలను సందర్శిస్తూ, సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

100 శాతం సంరక్షణ..

మండలంలోని 14 గ్రామం పంచాయతీల పరిధి ఉన్న 17 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద వన నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఖమ్మంపల్లి, అడవిశ్రీరాంపూర్, ఓడేడు, దర్యాపుర్, ఇప్పలపల్లి, పారుపల్లి, లక్కారం, మచ్చుపేట, ఉమ్మడి మండలంలోని ఆదివారంపేట, బుధవారంపేట గ్రామాల్లోని వన నర్సరీలో 9 లక్షల మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ అధ్వర్యంలోనూ ఏడు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేయాగా సీతంపేట, పోతారం, హరిపురం, కేశనపల్లి, ముత్తారం, మైదంబండ, లద్నాపూర్‌లో ఏడు లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఆయా నర్సరీల్లోని మొక్కలు వేసవిలో ఎండిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

లక్ష్యం.. 16 లక్షలు..

హరితహారంలో భాగంగా మండలంలో 16 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారులు ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం ఉపాధిహామీ పథకం కింద 9 లక్షలు, అటవీశాఖ అధ్వర్యంలో 7 లక్షలు మొక్కలను పెంచుతున్నారు. 17 నర్సరీల్లో లక్షా 12 వేల టేకు మొక్కలను, 7 లక్షల 78 వేల వివిధ రకాల మొక్కలను జూలైలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, బొప్పాయి, మునగ, గుల్‌మొహర్, గులాబీ, మల్లె, మందార మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని సంరక్షించేందకు అధికారులు, అయా శాఖల సిబ్బంది ముమ్మరంగా కృషి చేస్తున్నారు.

లక్ష్య సాధనకు కృషి చేయాలి..

హరితహారం కార్యక్రమంలో 16 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా లక్ష్యాన్ని సాధించేందకు మండలంలోని ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలి. ప్రతి నర్సరీలో దాదాపు లక్ష మొక్కలను పెంచుతున్నాం. వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం - 2018 ప్రకారం బాధ్యతాయుతంగా పని చేయాలి. సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- మణికంటేశ్, ఎంపీడీఓ

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...