ధర్మారం మామిడి ఢిల్లీకి..


Thu,May 23, 2019 02:00 AM

-బంగన్‌పల్లికి భలే గిరాకీ
-రెండు రాష్ర్టాలకు ఎగుమతి
-రూ.కోట్లలో వ్యాపారం
-మూడు మార్కెట్ మండీలు

ధర్మారం : బంగినపల్లి మామిడి కాయలకు భలే గిరాకీ ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ధర్మారం మండలంలో ఏర్పాటు చేసిన మామిడి కొనుగోలు కేంద్రాల ద్వారా ఏటా రూ. కోట్లలో వ్యాపారం సాగుతుంది.

వివరాలోకి వెళితే...ధర్మారం మండలంలో అధిక విస్తీర్ణంలో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు. సుమారు 3150 ఎకరాలు విస్తీర్ణం మామిడి తోటలు ఉన్నాయి. వాటిలో 90 శాతం తోటల్లో బంగినపల్లి, కొద్దిపాటి విస్తీర్ణంలో దసేరి రకం పెంచుతున్నారు. ఈ రకానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. వరి తర్వాత రైతులు ఎక్కువ మామిడి చెట్ల పెంచేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఏటా తోటల పెంపకం విస్తీర్ణం పెరుగుతుంది. దీంతో నీటి సౌకర్యం ఉన్న రైతులు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. 5 నుంచి 6 ఏళ్ల కాలంలోనే మామిడి కాయలు కాసి రైతులకు ఆదాయం రావటం ప్రారంభమవుతుంది. తోటల పెంపకం అంతా వాతావరణ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కాత, పూత, పిందె దశలో వాతావరణం అనుకూలిస్తే ఇక మామిడి రైతుకు కలిసి వస్తుంది.

కాయలు పెరిగిన తర్వాత గాలి దుమారం, అకాల వర్షాలు కురిస్తే నష్టం వాటిల్లుతుంది. ప్రకృతి విలయాన్ని దాటి బయటకు వస్తే రైతుకు మామిడి ద్వారా మంచి లాభాలు ఉన్నాయి. ఈ సారి పూత దశలోనే గత జనవరి 25,26 తేదీల్లో అకాల వానలు కురిసినట్లు ఉద్యాన వనశాఖ విస్తీర్ణ అధికారి మహేశ్ తెలిపారు. పూత సమయంలో వర్షాలు కురవడంతో ఆ శాఖ అధికారులు నష్టం అంచనా వేయలేక పోయారు. ప్రకృతి కల్గించిన నష్టంతో పాటు పేనుబంక తెగులు, తేనె మంచు పురుగు ఆశించడంతో ఎంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఏడాది ఆశించిన దిగుబడి రాలేదని రైతులు పేర్కొంటున్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఈ ప్రాంతంలో పండించిన బంగినపల్లి ఇతర రకాలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. ఈ కాయలు ఎంతో ఆకర్శణీయంగా ఉంటాయి. అవి పక్వానికి వచ్చాయంటో ఎంతో నోరూరిస్తాయి. అందుకు ఈ మా మిడికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీంతో ఇక్కడి కాయలు కొనుగోలు చేసేందుకు మండీలు వెలుస్తున్నాయి. గతంలో ధర్మారం మండలంలో ఒక మండి మాత్రం ఉండేది. ఇప్పుడు మూడు ఉన్నాయి. ఇందులో ఎర్రగుంటపల్లిలో పెద్ద కొనుగోలు కేంద్రం ఉంది. కటికెనపల్లిలో మరో రెండు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ఈ కొనుగోలు కేంద్రా లు రైతులు తీసుకు వచ్చిన మామిడి కాయలతో కళకళలాడుతున్నాయి.

ఒక్కో కొనుగోలు కేంద్రంలో కిలో బరువు మామిడికి వేర్వేరుగా ధర చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మామిడి కాయల సైజులను అనుసరించి కిలోకు 25, 27, 32 వరకు చొప్పున ధర పలుకుతుంది. ఎక్కువ ధర చెల్లిస్తున్న మార్కెట్ మండీలలో మామిడి కాయలను రైతులు విక్రయిస్తున్నారు. ఆయా మామిడి కాయలు కొనుగోలు చేసిన మండీల్లో ఒక్కో తీరుగా విక్రయించిన తర్వాత డబ్బులు చెల్లిస్తున్నారు.

రోజూ ఇక్కడి నుంచి
ధర్మారం మండలం నుంచి మామిడి కాయలు ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ర్టాల నుంచి కూలీలు ఇక్కడకు వచ్చి మండీలలో మామిడి కాయలు ప్యాకింగ్ చేస్తున్నారు. పిల్లలతో సహా వచ్చి ప్యాకింగ్, లోడింగ్ పనులు చేస్తున్నారు. ఒక్కో పెట్టెలో వరి గడ్డి, కాగితాలు పెట్టి 20 కిలోల బరువు గల మామిడి కాయలను ప్యాక్ చేస్తారు. ఒక్కో లారీలో 800 బాక్స్‌లను లోడ్ చేసి పంపిస్తారు. ఈ లెక్కన సుమారు 16టన్నుల మామిడి కాయలు ఆయా రాష్ర్టాలకు రోజూ ఎగుమతి అవుతున్నాయి.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...