శోభాయమానం..


Mon,May 20, 2019 03:52 AM

-ఖిలావనపర్తిలో వైభవంగా నృసింహుడి జాతర
-కన్నులపండువగా రథోత్సవం
-తరలివచ్చిన భక్తజనం
-దాదాపు 30వేల మందికిపైగా రాక
ధర్మారం: ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి జాతర (రథమహోత్స వం) ఆదివారం వైభవంగా జరిగింది. సుమారు 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను సైతం లెక్కచేయకుండా వివిధ జిల్లాలు, మండలాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, ఈసారి ఎన్నికల కోడ్ వల్ల జాతర నిర్వహణ కమిటీ ఏర్పాటు కాకపోవటంతో ధర్మాదాయ శాఖ అధికారు లు జాతర నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరలో చివరి రోజైన ఆదివారం రథోత్సవ (జాతర) కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో రథం వద్ద ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం భక్తులు రథాన్ని లాగటంతో జాతర ఉత్సవం ప్రారంభమైంది.

అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
భక్తులు జాతరకు ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్దసంఖ్యలో హాజరు కావటం విశేషం. క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో నిలబడ్డారు. ఆలయానికి అనుసంధానంగా ఈసారి విస్తరణతో కొత్తగా మెట్లు నిర్మించటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు నృసింహ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రథం వద్ద ఉత్సవ విగ్రహాల వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా స్వామి వారికి భక్తులు పెద్ద సంఖ్యలో మేక పోతులను, కోళ్లను బలి ఇచ్చారు. అనంతరం భక్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో వన భోజనాలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కాగా, ఆలయ ఈఓ మారుతిరావు ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయగా, ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులతో పాటు కరీంనగర్‌కు చెందిన అంతర్యామి చారిటబుల్ ట్రస్ట్ ఇన్‌చార్జి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో 20 మంది వలంటీర్లు జాతరలో భక్తులకు తమవంతుగా సేవలందించారు. ఆలయ వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. ఉత్సవంలో గ్రామ సర్పంచ్ సాగంటి కనకతార, ఎంపీటీసీ సభ్యురాలు పాకాల అనురాధ, ఉపసర్పంచ్ కీసర స్వరూప, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు పాకాల రాజయ్య, గ్రామ కోఆర్డినేటర్ జంగిలి గట్టుస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు సాగంటి కొండయ్య, ఠాకూరు హన్మాన్‌సింగ్, మద్దునాల వెంకటేశ్, కలవేని పెద్దులు, కనమండ రమేశ్, జంగిలి రాజిరెడ్డి, మంథెన సాయిలు, ముత్యాల వీరస్వామి, కాంపెల్లి రాజయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నేడు హుండీల లెక్కింపు
ఆదివారం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జాతర ఉత్సవం జరిగిన నేపథ్యంలో సోమవారం స్వామి వారి హుండీ ల లెక్కింపు చేస్తామని ఆలయ ఈఓ మారుతిరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు చేసి జాతరకు వచ్చిన ఆదాయం ప్రకటిస్తామని వెల్లడించారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...