పరిశీలించి.. సమీక్షించి


Sun,May 19, 2019 02:16 AM

-ఎన్టీపీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్
-ముందుగా టీఎస్టీపీపీ నిర్మాణాల పరిశీలన
-పనుల ప్రగతిని తెలుసుకుంటూ ముందుకు..
-అనంతరం ఎన్టీపీసీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్‌లో జెన్‌కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష
-విద్యుత్ కేంద్రం పనుల్లో వేగం పెంచాలని ఆదేశం
-జ్యోతి భవన్‌లో రాత్రి బస
-నేడు సతీమణితో కలిసి కాళేశ్వర దేవస్థానానికి

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ జ్యోతినగర్: రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన, సాయంత్రం 4.12 గంటలకు రామగుండం ఎన్టీపీసీలోని జ్యోతిభవన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎన్టీపీసీ సీఅండ్‌ఎండీ గురుదీప్ సింగ్, ఎన్టీపీసీ ఈడీ డాక్టర్ కులకర్ణి, ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఈడీ దూబేతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సింగరేణి సీఅండ్ ఎండీ శ్రీధర్, జెన్‌కో సీఅండ్‌ఎండీ ప్రభాకర్ రావుతో కలిసి నిర్మాణంలో ఉన్న 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం టీఎస్టీపీపీ (తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు) పనులను పరిశీలించారు. విద్యుత్ ప్లాంటులో కాలినడకన తిరిగారు. దాదాపు అరగంటపాటుపాటు పరిశీలించగా, పనులను జరుగుతున్న తీరును ఎన్టీపీసీ అధికారులు సీఎంకు వివరించారు.

పరిపాలనా భవనంలో సమీక్ష..
ఎస్టీపీపీని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్టీపీసీలోని పరిపాలన భవన్‌కు చేరుకున్నారు. అక్కడ జెన్‌కో, ఎన్టీపీసీ అధికారులతో దాదాపు 45 నిమిషాలు సమీక్షించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించగా, ఒక యూనిట్‌ను 2020 అక్టోబర్ నాటికి, రెండో యూనిట్‌ను 2021 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ ఈ ప్లాంట్ పూర్తయ్యే నాటికి అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ను అందించాలనీ, విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీతో ఇచ్చిపుచ్చుకునే విధానం అవలంబిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు సాగునీటిని అందించడానికి ఎన్టీపీసీ సైతం సహకరించాలని కోరారు. తక్కువ ధరకు విద్యుత్‌ను రాష్ర్టానికి అందించాలని ఇందుకోసం రాష్ట్ర జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సమన్వయంగా వ్యవహరిస్తారని తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లపైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి అనుమతి ఇస్తామని చెప్పారు. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద చిన్న రిజర్వాయర్ కేటాయిస్తామనీ, ఆ తర్వాత పెద్ద రిజర్వాయర్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. కాగా, సమీక్ష అనంతరం కేసీఆర్ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో బస చేశారు.

నేడు కాళేశ్వరానికి సీఎం దంపతులు..
సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హెలీక్యాప్టర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వెళ్లనున్నారు. అక్కడే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అదే జిల్లాలోని మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. తిరిగి మధ్యాహ్నం తర్వాత రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని, మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం హైదరాబాద్ పయనం కానున్నారు.

భారీ బందోబస్తు..
కేసీఆర్ ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి రావడం ప్రత్యేకతను సంతరించుకోగా, రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ రక్షిత కే మూర్తి, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. కాగా పర్యటనలో ఇంటెలిజెన్స్ ఐజీ ఎంకే సింగ్, డీఐజీ ప్రమోద్‌కుమార్ కూడా ఉన్నారు.

సీఎంకు ఘన స్వాగతం..
ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణి శోభతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కలిసి శనివారం మధ్యాహ్నం ఎన్టీపీసీకి చేరుకోగా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ శ్రీదేవసేన, కరీంనగర్ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు, భానుప్రసాద్ రావు, నీటి పారుదల శాఖ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్, టీఆర్‌ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ చిట్టూరు రాజమణి, టీఆర్‌ఎస్ నాయకురాలు మూల విజయారెడ్డి, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఎన్టీపీసీలోని జ్యోతి భవన్ గెస్ట్‌హౌస్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...