పకడ్బందీగా ‘లోక్‌సభ’ కౌంటింగ్‌


Fri,May 17, 2019 02:54 AM

-ఎన్నికల నిబంధనలు పాటించాలి
-కలెక్టర్‌ శ్రీదేవసేనలెక్కింపు సిబ్బందికి శిక్షణ
జ్యోతినగర్‌ : పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల కౌటింగ్‌ పక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన ఆదేశించారు. గురువారం ఎన్టీపీసీ ఈడీసీ ఆడిటోరియంలో లోక్‌సభ ఎన్నికల లెక్కింపు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. శిక్షణకు కొంతమంది సిబ్బంది గైర్హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గైర్హాజరైన 16మంది కౌటింగ్‌ సూపర్‌వైజర్లు, 12 మంది కౌటింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ కౌటింగ్‌ పక్రియ మొత్తం మైక్రో పరిశీలకుల పర్యవేక్షణలో కొనసాగుతుందనీ, ఎలాంటి పొరపాట్లకు అస్కారం లేకుండా పక్రియ జరగాలని ఆదేశించారు. నేడు కౌటింగ్‌ నిర్వహణపై శిక్షణ అందించామనీ, ఈ నెల 21న రామగిరి మండలంలోని మంథని జేఎన్‌టీయూ కళాశాలలో ప్రాక్టికల్‌ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. కౌటింగ్‌ సిబ్బంది అందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. కౌటింగ్‌ సమయంలో సిబ్బంది తమ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలనీ, కౌటింగ్‌ ఎజెంట్లు, ఇతర వ్యక్తులతో అనవసరపు వాగ్వాదాలు చేసుకోరాదని సూచించారు. ఏజెంట్లకు వచ్చే సందేహాలను ఏఆర్వోలు మాత్రమే నివృత్తి చేస్తారనీ, నిబంధనల మేరకు మాత్రమే సిబ్బంది విధులు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కౌటింగ్‌ సిబ్బందికి ఒక వాట్సప్‌ గ్రూపు తయారు చేస్తామనీ, అందులోనే సిబ్బంది సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయనీ, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక కౌటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌటింగ్‌ సూపర్‌వైజర్‌, కౌటింగ్‌ మైక్రో పరిశీలకుడు, ఒక గ్రూప్‌ డీ సిబ్బంది ఉంటారనీ, వీరికి అదనంగా సాధారణ ఎన్నికల పరిశీలకుల వద్ద అదనపు కౌటింగ్‌ అసిస్టెంట్‌ రిజర్వు స్టాఫ్‌ ఉంటారని పేర్కొన్నారు. కౌటింగ్‌ రోజు ఉదయం 5గంటలకు మాత్రమే సిబ్బందికి వారికి కేటాయించిన టేబుళ్ల వివరాలు తెలుపుతామని కలెక్టర్‌ చెప్పారు. కౌటింగ్‌ ప్రారంభంతోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించాల్సి ఉంటుందనీ, అరగంట తర్వాత ఈవీఎంలను లెక్కించాలన్నారు. కౌటింగ్‌ ప్రారంభానికి ముందే ఈవీఎంల సీల్‌ చూసుకోవాలనీ, కౌటింగ్‌ సమయంలో ఈవీఎంలోని కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే ఉపయోగపడుతుందని, అవసరమైతేనే బ్యాలెట్‌ యూనిట్‌ తీసుకొని రావాలని సూచించారు.

కంట్రోల్‌ యూనిట్‌లోని టోటల్‌ స్విచ్‌ ఆన్‌ చేయగానే మొదట పడిన ఓట్ల వివరాలు కనిపిస్తాయనీ, వాటిని ఫారం 17సీతో సరిచేసుకోవాలనీ, అనంతరం రిజల్ట్‌ బటన్‌ ఆన్‌ చేయగా వచ్చిన ఫలితాల వివరాలను కౌటింగ్‌ ఏజెంట్లకు కనిపించేలా చూపాలన్నారు. రిటర్నింగ్‌ అధికారి అనుమతి లేనిది ఫలితాలను విడుదల చేయరాదని కలెక్టర్‌ ఆదేశించారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనీ, వారికి సంబంధించిన ఎన్నికల ఏజెంట్లు కౌటింగ్‌ సమయంలో ఉంటారని తెలిపారు. మొదటి రెండు రౌండ్ల కౌటింగ్‌ సమయంలో వారు ఉత్సాహంతో ఉంటారనీ, ఆ సమయంలో సిబ్బంది మరింత జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కౌటింగ్‌ పక్రియను పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో కే నరసింహమూర్తి, మంచిర్యాల సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌, పెద్దపల్లి ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మంథని ఆర్డీవో కే నగేష్‌, పారమెంటు పరిధిలోని తాసీల్దార్లు, సిబ్బంది, మాస్టర్‌ ట్రైనర్స్‌, కరీంనగర్‌ జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...