పదిలో సర్కారు హవా


Tue,May 14, 2019 05:03 AM

-సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు
-మెజార్టీ స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత..
-టెన్త్ ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం
-ఈ సారి కూడా బాలికలే టాప్
-బాలురు 95.38శాతం
పదో తరగతి ఫలితాల్లో సర్కారు బడులు సత్తా చూపాయి. మెజార్టీ పాఠశాలలు 100 ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో జిల్లాకు 13వస్థానం రాగా, జిల్లా విద్యాశాఖ ముందస్తు ప్రణాళికలు, ఉపాధ్యాయుల కృషితో మరో రెండు మెట్లు పైకి ఎగబాకి, గతం కంటే మెరుగైన ర్యాంకును సాధించింది. జిల్లాలో మొత్తంగా 96.10శాతం ఉత్తీర్ణత నమోదవగా, అందులో ఈ సారి కూడా బాలికలే టాప్‌లో నిలిచారు. పరీక్ష రాసిన వారిలో 96.76శాతం మంది బాలికలు, 95.38శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. జూన్10 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ ;పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సత్తాచూపాయి. జిల్లాలోని మెజార్టీ ప్రభుత్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు 23 మంది 10జీపీఏ సాధించారు. జిల్లాలో ఈ సారి 9,350 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 4,507మంది బాలురు, 4,843మంది బాలికలు ఉండగా, 8,985మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,299 మంది బాలురు, 4,686మంది బాలికలు పాసయ్యారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 96.10శాతంగా నమోదుకాగా, ఇందులో 95.38 మంది బాలురు, 96.76 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 263 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, ఇందులో 240మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉండగా, 23 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. 9 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏడుగురు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఏడుగురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.

జిల్లాకు 13వ స్థానం..
పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాకు 13వ స్థానం వచ్చింది. గతేడాది 87.61శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలువగా, ఈ సారి రెండు స్థానాలు ఎగబాకి మెరుగైన ర్యాంకు సాధించింది. పక్కా ప్రణాళికలతో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. గతం కంటే ఒకస్థానాన్ని మెరుగు పరుచుకుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులకు వివిధ స్వచ్చంధ సంస్థల సహకారంతో పరీక్షలపై భయాలను తోలగించడానికి చేసిన కౌన్సిలింగ్‌లు, ప్రత్యేక తరగతులు విజయానికి బాటలు వేశాయి.

సర్కారు బళ్ల సత్తా..
ఫలితాల్లో సర్కార్ బళ్లు సత్తా చాటాయి. మెజార్టీ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. పెద్దపల్లి మండలం బ్రహ్మణపల్లి, హనుమంతునిపేట, కొత్తపల్లి, మారేడుగొండ, మూలసాలలోని పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. సుల్తానాబాద్ మండలంలో ఆరు పాఠశాలలు, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని 11పాఠశాలలు, జూలపల్లి మండలంలోని ఏడు పాఠశాలలు, ఓదెల మండలంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలు, ధర్మారం మండలం పత్తిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు నంది మేడారం బాలుర గురుకుల పాఠశాల, మల్లాపూర్, నంది మేడారం బాలికల గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. రామగిరి మండలంలో నాగేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముత్తారం మండలంలో ముత్తారం, అడవిశ్రీరాంపూర్, పోతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంతర్గాం మండలంలోని పొట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. పాలకుర్తి మండలం కన్నాల, కుక్కలగూడుర్, పాలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు, బసంత్‌నగర్‌లోని ఇండియాన్ మిషన్ స్కూల్ (ఏయిడెడ్) విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.

10 జీపీఏ సాధించి వీరే..
పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య 10జీపీఏ సాధించింది. అలాగే తుర్కలమద్దికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఈదునూరి మమత, ముత్తారం మండలం దడియాపూర్ పాఠశాలలో పేర్ల నవీన్, అలబామ సుస్మిత, రామగిరి మండలం కల్వచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వేము రమ్య, బూడిద శృతి, అలాగే బసంత్‌నగర్ ఐఎంఎస్ పాఠశాలలో అన్షుల్ సింగ్ చౌహాన్, బీ ఐశ్వర్య, టీ హిమశ్రీ, జ్యోతిరాయ్, టీ స్వర్ణాంజలి, పీ సంజన, బీ వివేక్ 10 జీపీఏ సాధించారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల మోడల్‌స్కూల్‌లో ఈ నంద కిశోర్, కే శ్రావణి, కే వెంకటేశ్, ఎస్ మేఘన, జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భూసారపు ఇందు, ఓదెల మండలం పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాకోటి అనూష, ఓదెల మోడల్ స్కూల్‌లో వేల్పుల మానస, ధర్మారం మోడల్ పాఠశాలలో బెక్కెం అక్షయ, ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాలలో సీహెచ్ చైతన్య 10 జీపీఏ సాధించారు.

వచ్చే నెల 10 నుంచి అడ్వాన్స్ సప్లమెంటరీ
పదో తరగతి తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 29వ తేదీ ఆఖరుగా నిర్ణయించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఎలాంటి అపరాద రుసుం లేకుండా, ఆ తర్వాత రూ. 50 ఫైన్‌తో చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తారు.

ట్రినిటికి ర్యాంకుల పంట..
పది ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటి ఉన్నత పాఠశాల మరోమారు రికార్డు సృష్టించింది. ఈసారి ఫలితాల్లో ఏకంగా 95మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. 10 గ్రేడు పాయింట్లు సాధించిన విద్యార్థులను ట్రినిటి విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందించారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...