ఇక సెలవు..


Sun,May 12, 2019 02:19 AM

-జీడీకే10 గనితో సింగరేణికి 42ఏళ్ల అనుబంధం
-ఇప్పటివరకు 15మిలియన్ టన్నులకుపైగా బొగ్గు వెలికితీత
-ఉత్పత్తిలో అనేక రికార్డుల చేధన
-మూసివేతకు యాజమాన్యం నిర్ణయం
-వరదల ముప్పు, నిల్వలు అట్టడుగులో ఉండడమే కారణం!
-ఓసీపీ-1లో విలీనానికి చర్యలు
-ఇప్పటికే మొదలైన ఉద్యోగులు,కార్మికుల బదిలీల ప్రక్రియ
అది అపార బొగ్గు నిల్వలున్న క్షేత్రం. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం జిల్లాలో పురుడుపోసుకున్న నల్లబంగారం క్షేత్రం. అదే నండీ రామగిరి మండలం నాగెపల్లి శివారులోని జీడీకే10వ గని. 1978లో పురుడుపోసుకొని, ఇప్పటి దాకా 15 మిలియన్ టన్నులకు పైగా నిధిని వెలికితీసి, అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఈ భూగర్భగని త్వరలోనే తన సేవలకు వీడ్కోలు పలుకబోతున్నది. అండర్‌గ్రౌండ్‌లో వరదల ముప్పు, నిల్వలు అట్టడుగుకు చేరడంతో మూసివేసి, ఓసీపీ-1లో విలీనం చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉద్యోగులు, కార్మికులకు సమీప గనులు, ఓసీపీలకు బదిలీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగెపల్లి శివారులో 1978 ఏప్రిల్‌లో పురుడుపోసుకున్న జీడీకే 10ఇైంక్లెయిన్‌గా (పదోగని) మూసివేతకు రంగం సిద్ధమైంది. సింగరేణి సంస్థలో 42 ఏళ్లపాటు నిరంతరం బొగ్గును ఉత్పత్తి చేసి అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఆ గని త్వరలోనే కనుమరుగుకాబోతున్నది. వివరాల్లోకి వెళితే.. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన జీడీకే 10ఇైంక్లెయిన్‌గా (పదోగని) గనిలో గతేడాది నుంచి బొగ్గు ఉత్పత్తి స్తంభించింది.

ఇన్నేళ్లు దాదాపు 15మిలియన్ టన్నులకుపైగా బొగ్గును వెలికితీయగా, ఈ క్రమంలో బొగ్గు నిల్వలు అట్టడుగుకు చేరాయి. అలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సమయంలో బయటికి వచ్చే నీటికి అడ్డుగా కొన్నేళ్లుగా గనిలో డ్యాంలు నిర్మిస్తూ వస్తుండగా, వాటికి పగుళ్లు ఏర్పడి నీరు లోపలికి వచ్చి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. అలాగే పనిస్థలాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం, ఉత్పత్తికి విఘాతం కలగడం వంటి కారణాలతో మూసివేయాలని కొద్దిరోజులుగా యాజమాన్యం ఆలోచిస్తున్నది. నాలుగేళ్ల కింద సైతం ఒక డ్యామ్‌కు సంబంధించిన గోడకు భారీగా పగుళ్లు ఏర్పడి గనిలోకి వరద వచ్చింది. దీంతో అప్పుడు 15 రోజులుపాటు గనిని లాకవుట్ చేశారు. వరద ముప్పును అరికట్టేందుకు జులాజికల్ శాస్త్రవేత్తలు సందర్శించి డ్యామ్‌కు పడిన బుంగను పూడ్చివేయగా, తిరిగి యథావిధిగా బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. క్రమంగా నష్టాలు చవిచూస్తూ వస్తున్నది. స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ గని మూసివేతకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

కార్యాచరణ రెడీ
మరో వారం రోజుల్లో జీడీకే 10వగనిని మూసివేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ మేరకు సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ముందుగా గనికి సంబంధించిన 20 మంది ముఖ్య అధికారులకు బదిలీ ఆర్డర్లు ఇచ్చారు. అలాగే వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 670 మంది కార్మికులను రామగుండం రీజియన్‌ల్లోని వివిధ బొగ్గు గనులకు బదిలీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రెండ్రోజులుగా కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఓసీపీ-1లో విలీనానికి చర్యలు..
జీడీకే పదో గనిని మూసివేసి, సమీంలోని ఓసీపీ-1లో విలీనం చేసేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. అయితే గతంలోనే పాత పదో గనిలోని పలు గ్యాలరీలను గ్యాస్ వెలువడుతున్న కారణంగా సమీపంలోని ఆర్జీ -3లోని ఓసీపీ -1 పేజ్ -2లో విలీనం చేశారు. ఆ సమయంలో పాత పదోగనికి సంబంధించిన సైట్ ఆఫీస్, ఇతర విభాగాలు, గని ముఖద్వారం మొత్తం ఓసీపీ-1లో కలిపేశారు. అనంతరం పదోగని సమీపంలోనే తిరిగి మళ్లీ కొత్తగా 2006లో జీడీకే 10 ఇంక్లయిన్‌ను ప్రారంభించి, ఉత్పత్తిని ప్రారంభించారు. కొత్తగా సైట్ ఆఫీసులు నిర్మించారు. కార్మికులను మూడు నిమిషాల్లోనే గనిలో తీసుకెళ్లేందుకు మ్యాన్ వైడింగ్ షాప్ట్‌ను నిర్మించారు. అయితే పనిస్థలాల్లో ప్రతికూల పరిస్థితుల ఎదురుకావడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుండడం వల్ల మూసివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కార్మికులను బదిలీ చేస్తున్నాం..
- సంతోష్‌కుమార్, గని మేనేజర్
కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా పదో గనిని మూసివేసి, ఓసీపీ -1లో విలీనం చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 1978లో ప్రారంభమైన ఈ గనిలో లాంగ్‌వాల్ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేసి ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అధిక లోతులో ఉన్న బొగ్గును ఓసీపీ ద్వారా వెలికితీయడమే శ్రేయస్కరమనే సంస్థ భావించి, ఆ దిశగా కార్యాచరణ చేపట్టింది. ఇందులో పని చేసిన కార్మికులను దగ్గరలోని ఓపెన్‌కాస్ట్‌లకు లేదా భూగర్భ గనులకు బదిలీ చేస్తున్నాం.

బాయిని విడవడం బాధగా ఉంది...
- బండి రాజమల్లు, కార్మికుడు
నేను ఈ బాయిల 31 ఏళ్ల నుంచి పనిచేస్తన్న. మరో నెల రోజుల్లో దిగిపోతున్న. ఇన్నాళ్లూ అందరం కలిసిమెలిసి పనిచేస్కున్నం. ఇప్పుడు బాయిని మూసివేస్తన్రు. ఈ గనిని మూసివేయడం చాలా బాధగా ఉంది. నాతో పని చేసే గ్యాంగోళ్లలందరినీ ఒక్కదిక్కె బదిలీ చేయాలె.
వయసు మీద పడ్డోళ్లను ఇక్కన్నే ఉంచాలి..
- రాంపెల్లి సుదర్శన్ (కార్మికుడు)

ఈ గని మూసివేసినా ఇక్కడ రోజుకు 120 నుంచి 160 మంది కార్మికులతో పని ఉంటది. అందులో చేతకాని వయస్సు మీదపడ్డ కార్మికులకు ఇక్కడే డ్యూటీలు వేయాలె. అలాగే సీనియార్టీ ప్రకారం మేం కోరుకున్న చోటుకి పంపాలె. సర్పేస్‌కు పంపితే బాగుంటది.

ప్రతికూల పరిస్థితుల వల్లే..
- బీ. వీరారెడ్డి, ఏపీఏ జీఎం
బొగ్గు ఉత్పత్తికి అనుకూలంగా లేకపోవడం, పనిస్థలాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుండడం వల్లే పదో గనిని మూసివేసి, ఓసీపీ -1 ప్రాజెక్ట్‌లో విలీనం చేయాల్సి వస్తున్నది. గనిలో గతంలో ఓ డ్యామ్‌కు బీటలు పడి నీరు బయటికి వచ్చిన విషయం వాస్తమే అయినప్పటికీ, మూసివేతకు మాత్రం అది కారణం కాదు. డ్యామ్‌తో ఎలాంటి వరద ముప్పు లేకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాం. పదో గనిని ఓసీపీగా మార్చితేనే బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉండడంతో విలీనం చేస్తున్నాం. కార్మికులు ఎవరూ ఆందోళన వద్దు. వారు దరఖాస్తు చేసుకున్న ప్రకారం. సీనియార్టీ ఆధారంగా బదిలీ ఆర్డర్ ఇస్తున్నాం.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...