ఊరూరా ముమ్మరంగా ఉపాధి


Sun,May 12, 2019 02:16 AM

-వేసవిలో చేతినిండా పనిరోజూ 4,200 మంది కూలీల హాజరు
-అదనంగా 60 భత్యం
-సుమారు 6 లక్షల 30 వేల విలువైన పనులు
ధర్మారం: మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులకు చేతినిండా పనులు దొరుకుతున్నాయి. దినసరి కూలీతోపాటు అదనంగా భత్యాలు అందుతున్నాయి. ప్రస్తుత వేసవిలో ఉపాధి హామీ పథకంలో పనులపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం
వేసవిలో ఉపాధి హామీ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం 2019-20లో రెండు కోట్ల విలువైన పనులు చేయాలని ఉపాధి హామీ శాఖ వారు అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 5వ విడతలో హరిత హారంలో 16 లక్షల మొక్కలు నాటేందుకు 22 గ్రామాలలోని నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. ఇక మిగతా గుట్టలపై కందకాలు, నీటి గుంతల తవ్వకం, ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టాలని ఆ శాఖ అధికారులు సంకల్పించారు.

దీంతో ఏప్రిల్ నుంచి మండలంలో పనులు చేపట్టారు. మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలతో పాటు జూలపల్లి మండలం అబ్బాపూర్‌ను కలిపి మొత్తం 30 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎండ వేడి 42 డిగ్రీల సెల్సియస్ ఉన్నా వేసవిలో ఎలాంటి పనులు లేక ఇండ్లలో ఖాళీగా ఉంటున్న ఉపాధి కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఉదయం 6.30 నుంచి 10.30వరకు అనగా 4 గంటల పాటు కూలీలు హాజరై కందకాలు తవ్వుతున్నారు.వారికి సాధ్యమైనంత వరకు కందకాలు తవ్వే పనులు చకచకా ఉదయం పూటనే చేస్తున్నారు. ఎండ ముదిరేలోగా కూలీలు ఇంటిబాట పడుతున్నారు. పను లు చేపట్టే స్థలం వద్ద మేట్లు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, నీడనిచ్చే కవర్లు అందుబాటులో ఉంచుతున్నారు. పనితీరు, కొలతల ఆధారంగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఏప్రిల్‌లో దాదాపు 40 లక్షల విలువైన పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో జమ
సాధారణ నెలలో ఇచ్చే కూలీకంటే కేంద్ర ప్రభుత్వం కూలీలకు అదనంగా 60 వేసవి భత్యాన్ని ఇస్తున్నది. సాధారణంగా నిబంధనల ప్రకారం చేసిన పనికి 211 చెల్లిస్తారు. అదే వేసవి కాలంలో పని చేస్తే కూలీలకు అదనపు భత్యం లభిస్తుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న 211కు అదనంగా 60 ఇస్తారు. అయితే రోజు కనీస కొలతల ప్రకారం పని చేస్తేనే ఈ వేతనం అందుతుంది. రోజు కందకాన్ని మీటర్ పొడవు, మీటర్ లోతు, మీటర్ వెడల్పు తవ్వితే 211కు తోడు అదనంగా 60 అదనంగా కూలీ వేతనం వస్తుంది. లేని పక్షంలో చేసిన పనిని బట్టి కూలీలకు వేతనం లభిస్తుందని ఆ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. రోజు హాజరవుతున్న 4,200 కూలీలు వారు చేస్తున్న పనిని బట్టి రోజుకు సరాసరి 150 చొప్పున 6 లక్షల 30 వేల విలువైన పనులు కొనసాగుతున్నట్లు మండల ఉపాధి హామీ ఏపీఓ నాడెం రవి తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో పనులు కళకళలా డుతున్నాయి. వేతనాల సొమ్మును ఆన్‌లైన్‌లో కూలీల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ఏపీఓ వివరించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...