పరిషత్ సమాప్తం


Sat,May 11, 2019 01:32 AM

-13 జడ్పీటీసీ, 137 ఎంపీటీసీ స్థానాలకు
-ప్రశాంతంగా ఎన్నికలు
-తొగర్రాయి మండల ప్రాదేశిక స్థానం ఏకగ్రీవం
-మొత్తంగా 77.21శాతం ఓటింగ్

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికలు జిల్లాలో సమాప్తమయ్యాయి. రెండు విడతలూ ప్రశాంతంగా జరిగాయి. తొలి దఫా ఏడు మండలాల్లో ఏడు జడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు, రెండో దఫా ఆరు మండలాల్లో ఆరు జడ్పీటీసీ, ఒక ఏకగ్రీవ ఎంపీటీసీ స్థానం పోను 68 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో 3,75, 337మంది ఓటర్లు ఉండగా, రెండు విడతల్లో కలిపి 2,89, 580మంది ఓటేయగా, మొత్తంగా 77.21 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో తొలివిడత 1,43, 050 (76.29%) మంది ఓటేయగా, రెండో విడత 1, 46,530 (78.14%) మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.

తొలి విడత 76.29%..
జిల్లాలో తొలి విడతలో మంథని, కమాన్‌పూర్, ముత్తారం, రామగిరి, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం మండల జడ్పీటీసీ స్థానాలతో పాటు ఏడు మండలాల్లోని 69 ఎంపీటీసీ స్థానాలుండగా, జడ్పీటీసీ బరిలో 35మంది, ఎంపీటీసీ బరిలో 271మంది నిలిచారు. ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా, 1,87,518 మంది ఓటర్లకుగాను 1,43,050 మంది ఓటేశారు. మొత్తంగా 76.29 పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో అంతర్గాం మండలంలో 15,231 మంది ఓటర్లకు గాను 11,699 మంది(76,81%), పాలకుర్తి మండలంలో 29, 397 మంది ఓటర్లకు గాను 22,428 మంది (76.29%), కమాన్‌పూర్ మండలంలోని మొత్తం 18,531 మంది ఓటర్లకు గాను 15,146 మంది (81,73 %), రామగిరి మండలంలో 32, 040 మంది ఓటర్లు ఉండగా 22,783మంది(71.11%), మంథని మండలంలో 31,296 మంది ఓటర్లు ఉండగా 12,134 పురుష ఓటర్లు, 12,230 మంది (77.85%), ముత్తారం మండలంలో 20,557 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 15,853 మంది (77.12 %), ధర్మారం మండలంలో 40,456 మంది ఓటర్లు ఉండగా ఇందులో 30,777 మంది (76.06 %) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రెండో విడత 78.14%..
శుక్రవారం నిర్వహించిన రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలాల జడ్పీటీసీ స్థానాలతో పాటు 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సుల్తానాబాద్ మండలం తొగర్రాయి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో 68 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. జడ్పీటీసీ స్థానాల బరిలో 31 మంది, 68 ఎంపీటీసీ స్థానాలకు 244 మంది పోటీ చేయగా, శుక్రవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,87,659 మంది ఓటర్లకు 1,46,530 మంది ఓటేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 78.14 పోలింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు. మొత్తంగా తొలి రెండు విడతలు కలిపి జిల్లా వ్యాప్తంగా 79.24శాతం నమోదైందని తెలిపారు.

ఊపిరిపీల్చుకున్న అధికారులు..
పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కలెక్టర్ శ్రీ దేవసేన, జేసీ వనజాదేవి, సీపీ సత్యనారాయణ, డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ ముందుకుసాగారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తూనే, ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ పార్టీలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో గస్తీ చేపట్టారు. రూట్ మొబైల్స్‌తో పాటు ైస్ట్రెకింగ్ ఫోర్స్‌తో నిఘా పెంచి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...