పెళ్లింట తీరనిదుఃఖం


Fri,May 10, 2019 03:36 AM

-పత్రికలు పంచేందుకు వస్తూ వరుడి దుర్మరణం
-నీరుకుళ్ల శివారులో ట్రాక్టర్ ఢీకొని మృతి
-మిన్నంటిన బంధువుల రోదనలు
సుల్తానాబాద్ రూరల్ / వీణవంక : బంధువులకు పెండ్లి ప్రతికలు పంచేందుకు వస్తూ మరో వారం రోజుల్లో వివాహం జరగాల్సిన ఓ యువకుడు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన ఘటన నీరుకుళ్ల శివారులో గురువారం జరిగింది. ఎస్‌ఐ రాజేష్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దరిపెల్లి లక్ష్మీ-పోచయ్యలకు నలుగురు కొడుకులు. వీరిలో మూడో కొడుకైన సంతోష్ (29) కరీంనగర్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సుల్తానాబాద్‌కు చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 15న వీరి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పెండ్లి పత్రికలు బంధువులకు పంచేందుకు వరుడు సంతోష్ గురువారం ఉదయం తన బైక్‌పై మామిడాలపల్లి గ్రామం నుంచి సుల్తానాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో నీరుకుళ్ల గ్రామ శివారుకు చేరుకోగానే, తన ముందు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక భాగాన్ని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

పెళ్లింట పెను విషాదం..
సంతోష్ వివాహం సుల్తానాబాద్ అమ్మాయితో ఈ నెల 15న నిశ్చయమైంది. ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం పెళ్లింట తీరని దుఃఖాన్ని నింపింది. వరుడి తండ్రి పోచయ్య మాజీ సర్పంచ్ కాగా, ఈ ఘటనతో గ్రామస్తులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతివార్త తెలియగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...