రెండో విడతకు సిద్ధం కావాలి


Thu,May 9, 2019 02:01 AM

-పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
-కలెక్టర్ శ్రీదేవసే నఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్
కలెక్టరేట్ : జిల్లాలో రెండో విడత పరిషత్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ శ్రీ దేవసేన ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రెండో విడత ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరు మండలాల్లోని 69 ఎంపీటీసీ స్థా నాలు, ఆరు జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ ఉంటుందని చెప్పారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఆరు మండలాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని 1,87,660 మం ది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లతోపాటు పోలింగ్‌కు అవసరమైన సామాగ్రిని సంబంధిత అధికారులు సరి చూసుకోవాలని సూచించారు.

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సంబంధిత అధికారులంతా సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల ముందు నుంచే మద్యం విక్రయాలను నిషేధించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఒకే సమయంలో పోలింగ్ ఉంటుందనీ, ఎంపీటీసీ స్థానానికి గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, జడ్పీటీసీ స్థా నానికి తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఉంటుందన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వరుసలో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లను సీజ్ చేసి, స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలని ఆదేశించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, కాల్వశ్రీరాంపూర్‌లో జడ్పీహెచ్‌ఎస్‌లో, ఓదెలలో పీఎస్ మోడల్ స్కూళ్లలో రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

బ్యాలెట్ బాక్స్‌లు పూర్తి స్థాయిలో వచ్చిన వెంటనే పెద్దపల్లి మండలంలోని మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ వనజాదేవి, పెద్దపల్లి ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, లైజన్ అధికారి వినోద్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, జిల్లా సహకారాధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ రాజన్న, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్‌రావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...