అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం..


Tue,April 23, 2019 12:53 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అకాల వర్షం జిల్లా రైతులకు మరోమారు అపార నష్టాన్ని మిగిల్చింది.. సోమవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి మరోమారు వరి పంటకు నష్టం వాటిల్లగా జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి, ధర్మారం, సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, మంథని, కమాన్‌పూర్, ఓదెల తదితర మండలాల్లో సోమవారం ఉదయం 5:30నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఉదయం 8గంటల వరకు కురిసింది. భారీ వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుతోపాటు కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, సుల్తానాబాద్ తదితర మార్కెట్ యార్డులో ఉన్న వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం సైతం వర్షానికి తడిసింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో వరిపంట నెలవాలింది. అలాగే మామిడి పంటకు కూడా తీవ్రం నష్టం జరిగింది. పండ్ల తోటలతో పాటు కూరగాయాల తోటలు సైతం దెబ్బతిన్నాయి.

వారం రోజుల క్రితం జిల్లాలో కురిసిన వర్షానికి ఇప్పటికే 10వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయగా సోమవారం కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లాలోని ధర్మారం మండలంలో అత్యధికంగా 18.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కాల్వశ్రీరాంపూర్ మండలంలో 14.5, పెద్దపల్లిలో 11.2, జూలపల్లిలో 7.6మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సుల్తానాబాద్ మండలంలో 4.2 మిల్లీమీటర్లు, ఓదెల మండలంలో 6.0మిల్లీ మీటర్లు, ముత్తారం మండలంలో 1.9మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా మంథనిలో 1.2మిల్లీ మీటర్లు, పాలకుర్తితో 0.3మిల్లీ మీటర్లు, కమాన్‌పూర్‌లో 0.3మిల్లీమీటర్లు, ఎలిగేడు మండలంలో 0.6మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...