డంపులన్నీ బయటికి..


Mon,April 22, 2019 02:37 AM

-తూర్పు వీరప్పన్ కలప నిల్వలపై పోలీసుల నజర్
-ఎడ్ల శ్రీనును కస్టడీలోకి తీసుకొని స్థావరాల గుర్తింపు
-ఖానాపూర్‌లో నాలుగు టేకు దుంగలు స్వాధీనం
మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా విచక్షణారహితంగా అడవులను నరుకుతూ టేకు కలప అక్రమ రవాణాలో ఆరితేరి తూర్పు వీరప్పన్‌గా పేరుమోసిన స్మగ్లర్ ఎడ్ల శ్రీను నిల్వ చేసిన కలప డంపులపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇటీవల అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎడ్ల శ్రీనును తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ ప్రాంతంలో నిల్వ చేసిన కలప డంపులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ ఆకునూరి మహేందర్, ఎస్‌ఐ ఆర్కుటి మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల దాకా మంథని మండలం ఖానాపూర్ గోదావరి, బొక్కలవాగు శివారుల్లోని కలప నిల్వ స్థావరాలను ఎడ్ల శ్రీను, ఆయన సహ నిందితులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక కలప నిల్వ స్థావరంలో 12ఫీట్ల పొడవైన నాలుగు దుంగలను గుర్తించారు.

ఈ సందర్భంగా ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ ఈ నెల 19న ఎడ్ల శ్రీనివాస్, ఆయన సహ నిందితులు కిషన్, మధుకర్, సంతోశ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులు విచారణలో భాగంగా కలప రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్థావరాల గురించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇంకా పలు స్థావరాలను సైతం గుర్తించనున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. వీరంతా తూర్పు డివిజన్ అటవీ ప్రాంతం నుంచి సేకరించిన టేకు దుంగలను ఖానాపూర్ శివారులో దాచిపెట్టి అక్కడి నుంచి ఎడ్ల బండ్ల ద్వారా మంథని మండలం విలోచవరంకు తరలించి, అక్కడ ముక్కలుగా చేసి వాహణాల్లో గోదావరిఖనిలోని బాలాజీ, సాయిరాం సామిల్ మిల్లులకు తరలిస్తూ ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. కాగా, ఈ సోదాల్లో మంథని సర్కిల్, రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న కలప దుంగలను అటవీ శాఖ అధికారుల ద్వారా పంచనామా చేయించి వాటి విలువను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. పలువురు పంచుల సమక్షంలో పంచనామా చేసినట్లు తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...