క్వార్టర్స్ కేటాయింపు ఎప్పుడు ?


Mon,April 22, 2019 02:36 AM

-పది నెలలుగా ఉపాధ్యాయుల ఎదురుచూపులు
-పట్టించుకోని ఎన్టీపీసీ
జ్యోతినగర్ : ఎన్టీపీసీ పర్మినెంట్, టెంపర్వరీ టౌన్‌షిప్‌ల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఎన్టీపీసీ యాజమాన్యం క్వార్టర్లు కేటాయిస్తుంది. కానీ, ఈ విద్యా సంవత్సరం టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులకు క్వార్టర్లు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నది. ప్రస్తుతం పాఠశాలకు బదిలీపై వచ్చిన 12 మంది ఉపాధ్యాయులను 10 నెలల పాటు ఇదిగో, అదిగో ఇస్తామంటూ ఆశ పెడుతున్నది. ఒకే పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుల్లో కొందరికి క్వార్టర్లు కేటాయించి మిగితా వారికి కేటాయించకపోవడంపై ఎన్టీపీసీ అధికారుల తీరుపై పలు రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వరకు ఇక్కడ పాఠశాల నుంచి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల క్వార్టర్లు ఖాళీ అయినప్పడు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు కేటాయించడం మొదటి నుంచి అనవాయితీగా పెట్టుకున్న ఎన్టీపీసీ ఈ సారి మాత్రం కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు క్వార్టర్ల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. క్వార్టర్స్ ఖాళీ కాలేదనీ, పెండింగ్ అద్దె బకాయి ఉన్నాయనీ, సాకులతో పది నెలలుగా కాలయాపన చేయడంతో ఎన్టీపీసీకి వచ్చే అద్దె రుసుం కూడా యాజమాన్యం కోల్పోయింది. టౌన్‌షిప్‌లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు సమీప వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు సరైన సమయానికి క్వార్టర్స్ కేటాయిస్తున్న ఎన్టీపీసీ కేవలం జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చే సరికి చిన్న చూపు చూడడంపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సైతం క్వార్టర్లు కేటాయింపుపై ఎన్టీపీసీ విధి విధానాలను అనుసరించి ఇప్పటికి నాలుగు, ఐదు సార్లు లేఖ ద్వారా విన్నపించినా ఫలితం లేకుండా పోయిందని హెచ్‌ఎం పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా 830 మంది పేద పిల్లలకు విద్యా బుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయులకు వసతులు కల్పించడంలో ఎన్టీపీసీ దూరమవుతున్నట్లు తెలుస్తున్నది. అదే టౌన్‌షిప్‌లోని ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ ఉపాధ్యాయులకు, ఇతరులకు సరైన సమయంలో క్వార్టర్లు కేటాయించడంపై వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే, టౌన్‌షిప్‌లో ఒక్కరి పేరు మీద ఉన్న క్వార్టర్‌లో మరొక్కరు వినియోగించుకోవడం, అక్రమంగా నెలల తరబడి క్వార్టర్స్‌లోనే తిష్ట వేస్తున్న వారిపై ఏ మాత్రం చర్యలు తీసుకోని ఎన్టీపీసీ యాజమాన్యం, పేద పిల్లలకు విద్య అందించే ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేయడం ఏమిటని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మహారత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస ్థఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులను చిన్నగా చూడడం ఎన్టీపీసీ అధికారులకు తగదనీ, అందరితో సమానంగా చూడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉన్నదని బాధిత ఉపాధ్యాయులు కోరుతున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...