6,695 ఎకరాల్లో పంట నష్టం


Fri,April 19, 2019 02:39 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షం.. ఈదురుగాలుల ప్రభావం ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులకు ఆస్తినష్టం భారీగా జరిగింది. పెట్టుబడులు పూర్తయి పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పెద్దఎత్తున పంటలు నష్టపోగా ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు లేచిపోవడంతో తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం ప్రాంతాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసిన జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలో మొత్తం 57.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా వర్షాలకు, ఈదురు గాలులు జిల్లాలో మొత్తం 384 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 374 ఇళ్లు పాక్షికంగా, 10ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వర్షాలకు 3,952 మంది రైతులు సంబంధించిన 6,695 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక తయారు చేసింది. ఇందులో 6,345 ఎకరాల్లో వరిపంట, 287 ఎకరాల్లో మక్కజోన్న, 63ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. 321 హెక్టార్లలో వివిధ రకాల పండ్ల తోటలకు, కూరగాయాల తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానవనశాఖ అధికారులు నివేదిక అందజేశారు. ఇందులో 310 హెక్టార్లలో మామిడి, 2హెక్టార్లలో అరటి, 9 హెక్టార్లలో కూరగాయల పంటలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...