భూ సమస్యలు పరిష్కరించాలి


Wed,April 17, 2019 01:58 AM

కలెక్టరేట్: భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ భూ వివాదరహిత గ్రామాలుగా ప్రకటించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వనజాదేవి అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాదాబైనామాలు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, భూ సేకరణ అంశాలపై తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ల వద్ద అర్హత ఉండి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాలను వెంటనే పూర్తి చేసి రైతులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించాలన్నారు. ఏ గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి తహసీల్దార్లు, ఆర్‌ఐల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే పట్టాదారు పాస్‌పుస్తకం లభిస్తుందని, ఇళ్ల స్థలాలకు, ఇతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడం జరగదని గుర్తుచేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డిజిటల్ సంతకాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 1,82,953 భూ సంబంధిత ఖాతాలున్నాయని, వాటిలో 1,22,112 ఖాతాలకు డిజిటల్ సంతకాల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వ భూములు, ఆస్తులకు సంబంధించి 995 ఖాతాలను గుర్తించామన్నారు.

9,843 ఖాతాలు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండటంతో ఆధార్ వివరాలను సేకరించి పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణకు ఇచ్చామని వివరించారు. వీటికి సంబంధించిన డిజిటల్ ప్రక్రియను పూర్తి చేయాల్సిందన్నారు. అనంతరం సింగరేణి, కాళేశ్వరం, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణపై సంబంధిత అధికారులను వివరాలు తెలుసుకున్నారు. మంథని మండలం ఆరెంద గ్రామంలో 187 మంది రైతుల నుంచి సేకరించాల్సిన 186 ఎకరాల ప్రక్రియ కొనసాగుతుందనీ, సుమారు 22 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం సేకరించామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ వివరాల జాబితాను తయారు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణకు సహకరిస్తూ భూమిని అందించేందుకు సిద్ధంగా ఉన్న భూ యజమానులు తీసుకుని వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ నిర్వాసితులకు అందాల్సిన అన్ని రకాల సాయం ప్రభుత్వం నుంచి తప్పకుండా వస్తుందని, ఎలాంటి అభద్రతా భావం వారిలో తలెత్తకుండా అధికారులు చూసుకోవాలని సూచించారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, మంథని ఆర్డీవో కే నగేశ్, తహసీల్దార్లు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...