నేడే మండలి ఫలితం


Tue,March 26, 2019 01:27 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, ఉపాధ్యాయ నియోజవకర్గం నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. పట్టభద్రుల స్థానంలో 1,95,581 ఓట్లు ఉండగా 1,16,156 ఓట్లు పోలయ్యాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 23,160 ఓట్లు ఉండగా.. 19,376 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓట్లు లెక్కించేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 14, పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు మరో 14 టేబుళ్లు సిద్ధంగా ఉంచారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే లెక్కింపు సిబ్బందిని ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు 7 గంటల వరకు కేంద్రం వద్దకు రావాలని కోరారు. 7.15 గంటలకు స్ట్రాంగ్ రూంల తాళాలు తెరుస్తారు. 7.30 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్ చేస్తామని, 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారి తెలిపారు.

ప్రతి రౌండ్‌కు 1000 ఓట్లు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా మారింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోసం వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లపై ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. మొత్తం 409 బ్యాలెట్ బాక్స్‌లు ఉన్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 220 కామన్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒకే బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో పడిన ఓట్లను అభ్యర్థులు, వారి ఏజెంట్ల ద్వారా ముందుగానే వేరు చేస్తారు. ఒక్కో టేబుల్‌పై ప్రతి రౌండ్‌కు వెయ్యి ఓట్ల లెక్కన లెక్కిస్తారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో తక్కువగా అంటే 19,376 ఓట్లు మాత్రమే పోలవడంతో రెండో రౌండ్‌లోనే లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి కౌంటింగ్‌లో ఫలితాలు తేలక పోతే సబ్ పార్సిల్ పద్ధతిలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ లెక్కన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం ఉంది. ఇక పట్టభద్రుల స్థానానికి 1,16,156 ఓట్లు పోలైనందున 9 రౌండ్లలో లెక్కింపు జరిగే అవకాశం ఉంది. మొదటి రౌండ్‌లోనే ఫలితాలు తేలితే అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకవేళ ఫలితం తేలని పక్షంలో సబ్ పార్సల్ పద్ధతిలో తిరిగి లెక్కింపు ప్రారంభిస్తారు. దీంతో ఫలితం మరింత ఆలస్యం కావచ్చని భావిస్తున్న అధికారులు అ ందుకు కావల్సిన ముందస్తు ఏర్పాట్లను కూడా చేశారు.

పకడ్బందీగా ఏర్పాట్లు
మండలి ఓట్ల లెక్కింపునకు అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు సంబంధించిన అధికారులు, సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచారు. ఇందులో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా హుజూరాబాద్ ఆర్డీఓ బీ చెన్నయ్య, ధర్మపురి తహసీల్దార్ ఎన్ వెంకట్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా సిద్దిపేట ఆర్డీఓ ఎం జయచందర్ రెడ్డి, ఇల్లంతకుంట తహసీల్దార్ ఎస్ రాజు విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ సూపర్ వైజర్లుగా 36 మంది తహసీల్దార్లు వీరికి అసిస్టెంట్లుగా 64 మంది నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు విధుల్లో ఉంటారు. మైక్రో అబ్జర్వర్లుగా 35 మంది వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఐదుగురు ఇన్‌చార్జిలుగా నాయబ్ తహసీల్దార్ స్థాయి అధికారులు, వీరికి అసిస్టెంట్లుగా మరో 15 మంది వీఆర్‌ఓ స్థాయి సిబ్బంది పని చేస్తున్నారు. ట్యాబ్‌లేషన్ ఇన్‌చార్జిలుగా సీపీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు పని చేస్తున్నారు. బ్యాక్ బోర్డు ఇన్‌చార్జీలుగా ల్యాండ్ అండ్ రికార్డు కార్యాలయంలో పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులను నియమించారు. ట్యాబ్‌లేషన్ కో-ఆర్డినేటర్లుగా ఏడుగురు, మెటీరియల్ ఇన్‌చార్జిలుగా కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ కనుకయ్యకు బాధ్యతలు అప్పగించారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు నలుగురు తహసీల్దార్లను నియమించారు. ఇక 150 మంది పోలీసులతో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు వెళ్లడించేందుకు రెండు డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఆలస్యమైనట్లయితే రెండో షిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు మరో 50 మంది సిబ్బందిని అదనంగా ఉంచారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...