చెట్టును ఢీకొన్న కారు


Tue,March 26, 2019 01:26 AM

ధర్మారం : ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో సోమవారం కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఏఎస్‌ఐ జి.రవి కుమార్ కథనం ప్రకారం, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన రాగి వీరేశం (78), ఆయన భార్య సరోజన (76), కరీంనగర్‌లో నివాసముండే వీరేశం కూతురు కొండూరి పద్మ (51), అల్లుడు కొండూరి మనోహర్ (56)తో కలిసి జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోటకు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మనోహర్ కారు నడుపుతుండగా, కరీంనగర్ -రాయపట్నం స్టేట్‌హైవేపై ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో అకస్మాత్తుగా కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు అతివేగంగా దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యి, మనోహర్‌తో పాటు, ముందు సీట్‌లో కూర్చున్న వీరేశం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో మృతదేహాలను బయటకు తీశారు. కారులో వెనుక కూర్చున్న వీరేశం భార్య సరోజన, మనోహర్ భార్య పద్మ తీవ్రంగా గాయపడడంతో వారిని అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొందుతూ పద్మ మధ్యాహ్నం మృతి చెందింది. మృత దేహాలను కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వివరించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...