నేడే ఆఖరు


Mon,March 25, 2019 01:55 AM

కలెక్టరేట్: పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లకు సోమవారం ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులంతా తమ మద్దతుదారులతో నామినేషన్లు వేసేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ నుంచి బొర్లకుంట వెంకటేశ్ నేత, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ ఆగమ చంద్రశేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బాల కల్యాణ్ పంజా, బీజేపీ నుంచి ఎస్. కుమార్‌ను అభ్యర్థులుగా ప్రకటిస్తూ ఆయా పార్టీలు బీ-ఫారమ్‌లు అందజేయడంతో నామినేషన్ల పర్వంలో వేడి రాజుకుంది. నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్లను సమర్పించేందుకు తమ మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌తో పాటు మరో ప్రధాన పార్టీ అయిన బీజేపీ అభ్యర్థితో పాటు పలువురు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ప్రకటనలో నెలకొన్న సందిగ్ధతతో నామినేషన్ల పర్వంలో ఎలాంటి ఊపు కనిపించలేదు.

టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బొర్లకుంట వెంకటేశ్ నేతను ప్రకటించడంతో ఆయన తరఫున ఈ నెల 22న పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్ మొదటి సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఆగమ చంద్రశేఖర్‌ను ఆ పార్టీ ప్రకటించడంతో ఈ నెల 20న పెద్దపల్లి లోక్‌సభ ఇన్‌చార్జి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్యతో కలిసి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇప్పటి దాకా పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి తాడెం రాజ్‌ప్రకాశ్ (ఇండియా ప్రజాబంధు పార్టీ), ఇరుగురాల భాగ్యలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కొయ్యడ స్వామి (స్వతంత్ర), దుర్గం రాజ్‌కుమార్ (స్వతంత్ర), అంబాల మహేందర్ (స్వతంత్ర), గద్దల వినయ్‌కుమార్ (స్వతంత్ర), గొడిశెల నాగమణి (స్వతంత్ర), ఆశ్రం అశోక్ (స్వతంత్ర), బొర్లకుంట వెంకటేశ్ నేత (టీఆర్‌ఎస్), కుంటల నర్సయ్య (స్వతంత్ర), ఎక్రిళ్ల రాజేశ్ (స్వతంత్ర), బాల కల్యాణ్ పంజా (బీఎస్పీ), డాక్టర్ ఆగమ చంద్రశేఖర్(కాంగ్రెస్) తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటి దాకా మొత్తం 15 సెట్ల నామినేషన్లు నమోదయ్యాయి. మరో ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా ఎస్. కుమార్‌ను రెండు రోజుల క్రితమే ఆ పార్టీ ప్రకటించడంతో ఆయన తన మద్దతుదారులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది కూడా పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే వారు తమ నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉంది.

భారీ ఏర్పాట్లు..
పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ తరఫున బొర్లకుంట వెంకటేశ్ నేతను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయన తన మద్దతుదారులతో పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున సమీకరించి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారిగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూనే నామినేషన్‌ను చివరి రోజు అట్టహాసంగా వేయాలన్న ఉద్దేశంతో జన సమీకరణకు సన్నాహాలు చేశారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేశ్ నేతను రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గట్టి పట్టుదలతో ముందుకు సాగుతూ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతున్నారు. వీరితో పాటు లోక్‌సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సైతం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...