వివేక్ విద్రోహి


Sun,March 24, 2019 01:18 AM

ఫెర్టిలైజర్‌సిటీ: సొంత పార్టీ నాయకులను ఓడించడమే మాజీ ఎంపీ వివేక్ ఎజెండా అనీ, అతని మోసాన్ని తెలుసుకునే అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన అనంతరం రామగుండంలో తన అనుచర కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వివేక్ టీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌లో శనివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివేక్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ఎస్సీ అభ్యర్థిని గెలవనీయకుండా అడ్డుపడ్డ నీచ చరిత్ర వివేక్‌దని మండిపడ్డారు. బెల్లంపల్లిలో తన సోదరుడు వినోద్‌ను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నాయకులతో ములాఖతై టీఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నయ్యను ఓడించేందుకు కుట్ర పన్నలేదా..? అని ప్రశ్నించిన ఆయన, ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి తనను ఓడించేందుకు ఆడిన నాటకం అందరికీ తెలుసునని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఆయనపై ఏ ఒక్క టీఆర్‌ఎస్ నాయకుడికీ సదాభిప్రాయం లేదనీ, వివేక్ పార్టీకి చేసిన ద్రోహంపై ఆధారాలతో అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వివేక్ చేసిన ద్రోహం ధర్మపురి నియోజకవర్గంలో ఎక్కడైనా నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కుటుంబంలో తల్లిదండ్రుల నిర్ణయమెలాగో పార్టీలో అధినేత నిర్ణయం మాకు శిరోధార్యం అనీ, పార్టీని విమర్శిస్తే ఎవరూ ఊరుకోబోరని హెచ్చరించారు.

స్థిరత్వం లేని అన్నదమ్ములు: బాల్కసుమన్
టీఆర్‌ఎస్ పార్టీకి ద్రోహం చేసింది మాజీ ఎంపీ వివేకేనని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్‌లోకి వెళ్లి అధికారం కోసం మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరితే గౌరవంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తే ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా అన్నదమ్ములిద్దరూ సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఓడించడం కోసం ప్రయత్నించారని ఆరోపించారు. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దుటే వాళ్ల నైజమని విమర్శించారు. వివేక్, ఆయన సోదరుడు వినోద్‌కు ఎక్కడ స్థిరత్వం లేదనీ, 2014లో కాంగ్రెస్, తిరిగి టీఆర్‌ఎస్ మళ్లీ ఏ పార్టీయో తెలియని పరిస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. వాళ్ల ఆటలు ఇక సాగవని చెప్పారు. ధర్మపురిలో 57 వేల ఓట్ల మెజార్టీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్‌ను ఓడించేందుకు ఇతర పార్టీలకు మద్దతు తెలిపిన విషయం నిజమో కాదో ఆయన చెప్పాలని ప్రశ్నించారు. వాళ్లు ద్రోహులు కాబట్టే సీనియర్ నాయకుడిని ఓడించేందుకు లోపాయికారి ఒప్పందంతో కుట్రలు పన్నారని ఆరోపించారు. అంబేద్కర్ లాంటి మహానీయుడి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట ట్యాంక్‌బండ్‌పై మీ నాన్న వెంకటస్వామి విగ్రహం పెట్టి జయంతి, వర్ధంతిని చేసిందెవరో నీకు తెలియదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ విశ్వాసం, వినయ విధేయతలకు మారుపేరనీ, వివేక్ అంటే వెన్నుపోటు, విద్రోహం, వంచన అని ఎద్దేవా చేశారు. అన్ని కులాలకు, నాయకులకు సముచిత స్థానం టీఆర్‌ఎస్ కల్పిస్తే, దళితుల ఓట్లతో గెలిచిన వాళ్లు దేశమంతా సొంత పరిశ్రమలు పెట్టుకొని పెద్దపల్లిలో యువతకు ఉపాధి కోసం ఒక్క పరిశ్రమైనా స్థాపించారా అని ప్రశ్నించారు. నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వెంకటేశ్‌ను అధిష్ఠానం ఎంపిక చేసిందనీ, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...