ఎమ్మెల్సీ పోరు.. ప్రశాంతం


Sat,March 23, 2019 01:36 AM

- ముగిసిన రెండు స్థానాల ఎన్నికలు
- పట్టభద్రులకు 59.03శాతం.. ఉపాధ్యాయకు 83.54శాతం పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,
- కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి బ్యాలెట్ బాక్సులు
- ఈ నెల 26నఫలితాలు
- అప్పటిదాకా అభ్యర్థులకు ఎదురుచూపులే..


కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మండలి సమరం ముగిసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ సాగగా, పట్టభద్రులకు 59.03శాతం, ఉపాధ్యాయకు 83.54శాతం నమోదైంది. సాయంత్రం తర్వాత నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి తరలించి, ఇండోర్‌స్టేడియంలో భద్రపరిచారు. ఈ నెల 26న ఫలితాలను ప్రకటించనుండగా, ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జల్లాల పరిధిలో శుక్రవారం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరిగింది. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బారులు తీరి కనిపించారు. క్యూలో నిల్చొని ఉత్సాహంగా ఓటు వేశారు. కలెక్టర్లు, జేసీలతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకర్గంలో మొత్తం 1,95,581 మంది ఓటర్లకు 1,15,458 మంది (59.03శాతం), ఉపాధ్యాయ నియోజకవర్గంలో 23,160 మంది ఓటర్లకు 19,349 మంది (83.54 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వం క్యాజువల్ సెలవులు మంజూరు చేయడంతో ఉపాధ్యాయులే ఎక్కువశాతం ఓటు వేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 83.48 శాతం మంది ఉపాధ్యాయులు, 58.69 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం తర్వాత ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ జిల్లాకేంద్రానికి తరలించారు. అంబేద్కర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. ఈనెల 26న కౌటింగ్ చేసి, ఫలితాలను ప్రకటించనున్నారు.

పెద్దపల్లిలో ప్రశాంతం..
పెద్దపల్లి కలెక్టరేట్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు ఉదయం 8 గంటల నుంచే ఆయా కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. దివ్యాంగులు, వృద్ధులు సైతం ఉత్సాహంగా తరలివచ్చారు. మంథని డివిజన్ పరిధిలో 3,376 మంది పట్టభద్రులకు గాను 1,874 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 258 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 219 మంది ఓటేశారు. పెద్దపల్లి డివిజన్ పరిధిలో 13,010 పట్టభద్రులకుగాను 6,628 మంది, అలాగే 677 ఉపాధ్యాయులకుగాను 533 మంది ఓటేసినట్లు యంత్రాంగం తెలిపింది. మొత్తంగా 16,386 మం ది పట్టభద్రులకు 8,502 మంది ఓటేయగా, పోలింగ్ శాతం 53.24గా నమోదైంది. అలాగే 935 మంది ఉపాధ్యాయ ఓటర్లకుగాను 752 మంది ఓటేయగా, పోలింగ్ శాతం 81.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కా గా, సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు వెంకటరమణారెడ్డి, ఉమేందర్ బందోబస్తు చేపట్టారు. కాగా, సుల్తానాబాద్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరిశీలించారు.

ఓటేసిన ప్రముఖులు
గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ శ్రీదేవసేన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో జేసీ వనజాదేవి, తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, పెద్దపల్లి ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముద్దసాని శ్రీదేవి ఓటేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...