అగ్రస్థానంలో తెలంగాణ పథకాలు


Wed,March 20, 2019 02:28 AM

రామగుండం రూరల్ : దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. రామగుండం మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి రామగుండం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. సాగునీరు, తాగునీరు విషయమై అధికారుల పనితీరు సక్రమంగా లేదని పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభలో చర్చించారు. మిషన్‌భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నా, గ్రామస్థాయిలో అమలుచేయించాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి పనినీ అధికారులు గడువులోగా పూర్తిచేయించాలని ఆదేశించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులకోసం ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, అధికారులు కలిసి ప్రతి గ్రామానికి ఒకరోజు వెళ్లి అక్కడ జరుగుతున్న జాప్యాన్ని పరిశీలించాలన్నారు.

ఏప్రిల్ మొదటివారంలో పూర్తిస్థాయిలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి, 100 శాతం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలనీ, రాబోయే విద్యా సంవత్సరంలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో అంగన్‌వాడీల పనితీరు సక్రమంగా లేదనీ పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, అధికారులు విధులు సక్రమంగా నిర్వహంచడం లేదనీ, అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న 57 సంవత్సరాలకు ఆసర పెన్షన్, నిరుద్యోగ బృతి వంటి పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయశాఖ, విద్యుత్‌శాఖ, రెవెన్యూశాఖ, ఉపాధి హామీ పనులపై సమీక్ష జరిపారు. మండల సర్వసభ్య సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు హాజరైతే చాలా వరకు సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని పలువురు సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ ఆడేపు రాజేశం, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీడీఓ శివాజీ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...