కిడ్నీ బాధితులకు పునర్జీవం


Tue,March 19, 2019 03:11 AM

-వరంలా డయాలసిస్ సెంటర్
-ఖని ప్రధాన దవాఖానలో గతేడాది ఏర్పాటు
-అధునాతన పరికరాలు.. అందుబాటులో వైద్యనిపుణులు
-ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్, తెల్లరేషన్‌కార్డుల ద్వారా సేవలు
-ఇప్పటి వరకు 2661 మందికి చికిత్స
-ఒక్కోసారి వైద్యానికే రూ.3వేల నుంచి 4వేలు ఖర్చు
-బాధితులకు తప్పిన ఆర్థిక, దూరభారం
-పేద, మధ్య తరగతి వర్గాల హర్షం
ఫెర్టిలైజర్‌సిటీ : మానవ దేహంలోని మలినాలను, వ్యర్థాలను వడగట్టి బయటికి పంపడంలో మూత్రపిండాలే ముఖ్య పాత్రను పోషిస్తాయి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరమంతా ఉబ్బిపోతుంది. మనిషి ఉన్నట్లే కానీ జీవశ్చవంలా పడి ఉండాల్సిందే. ఆ తరుణంలో ఒక్కటే మార్గం. కిడ్నీలు మార్చుకోవడం.. లేదంటే డయాలసిస్ చేయించుకోవడం. ఆ రెండూ అత్యంత ఖర్చుతో కూడుకున్నవే. ఫలితంగా ఎంతోమంది పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాంతరంగా ప్రాణాలు విడుస్తున్నారు. వాతావరణ కాలుష్యం. ఆధునిక ఆహార అలవాట్లు కావచ్చు. రక్తంలో క్రియాటిన్ పెరిగి మూత్ర పిండ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అవగాహనలోపం, ఆర్థిక లేమితో గ్రామీణుల్లో ఎక్కువ శాతం ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. ఫలితంగా వ్యాధి ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ మెరుగైన వైద్యసేవలకు శ్రీకారం చుడుతున్నది. ఇందులో భాగంగానే గోదావరిఖని దవాఖానలో గతేడాది ఆధునిక హంగులతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

డయాలసిస్ అంటే...
సాధారణంగా శరీరంలోని రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేసి వ్యర్థాలను బయటకి పంపిస్తాయి. అవి కిడ్నీలు పనిచేయడం మానేస్తే వ్యర్థాలు రక్తంలోనే పేరుకుపోయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అలాంటి వారికి కృత్రిమంగా యంత్రపరికరాల ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడమే డయాలసిస్ అంటారు. వ్యాధిగ్రస్తులు వారానికి రెండు లేదా మూడు సార్లు తప్పక చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది జీవితాంతం కొనసాగించాల్సి ఉండడమేగాక ఖర్చుతో కూడుకున్నది. ఒక్కసారి వైద్యం చేయించుకోవాలంటే కనీసం రూ. 3వేల నుంచి రూ. 4వేల చొప్పున నెలకు రూ. 20వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎంతో మందికి ప్రయోజనం..
ఇప్పటివరకు డయాలసిస్ చేయించుకోవాలంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులంతా ప్రైవేట్ వైద్యశాలలనే ఆశ్రయించాల్సి వచ్చేది. అదీగాక అందుకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్థోమత లేని వాళ్లు ఆ ఖరీదైన వైద్యం కోసం ఇల్లు, పొలాలు ఆస్తులు అమ్ముకోవడం, పలువురు మృత్యువాత పడిన సంఘటనలు అనేకమున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి వర్గాల కిడ్నీ వ్యాధిగ్రస్థుల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన వైద్యశాలల్లో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించి, గోదావరిఖని ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసింది. గతేడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చిన కేంద్రం వేలాది మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నది.

అధునాతన పరికరాలు..
గోదావరిఖని దవాఖానలో రూ.40లక్షలతో డయాలసిస్ సెంటర్‌ను 5 బెడ్లతో ఏర్పాటు చేశారు. హెపటైటిస్ సీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఐసోలేటెడ్ డయాలసిస్ యంత్రాన్ని పెట్టారు. అధునాతన టెక్నాలజీ మిషన్లు, జనరేటర్లు, రోగులకు శుద్ధజలం అందించేందుకు ప్లాంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పారు. కేంద్రంలోని ప్రతి బెడ్డుకూ డయాలసిస్(రక్తశుద్ధి) చేసే యంత్రాన్ని సమకూర్చారు. నిర్వహణ బాధ్యతలను జర్మనీకి చెందిన డీమెడ్ హెల్త్ కేర్ సంస్థకు సర్కారు అప్పగించింది. సెంటర్‌లో డీమెడ్ సంస్థకు చెందిన ఇద్దరు సెంటర్ ఇన్‌ఛార్జిలతోపాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒకరు డాటా ఎంట్రీ ఆపరేటర్ నిత్యం వైద్యసేవలను అందిస్తున్నారు.

2661 వేల మందికి సేవలు..
ఖని ప్రధాన దవాఖానలోని డయాలసిస్ కేంద్రం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా రోగులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తూ పేదల మన్ననలను పొందుతున్నది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ వైద్యం చేయించుకుంటున్నారు. కేంద్రం ఏర్పాటైన 10 నెలల్లోనే 2661 మంది లబ్ధిపొందారు. ఒక్కో రోగికి రూ. 20వేల చొప్పున జర్మనీకి చెందిన డీమెడ్ సంస్థకు ప్రభుత్వం నెలనెలా చెల్లిస్తున్నది. కేంద్రం నిర్వహణలో ఎలాంటి రాజీలేకుండా ఆ సంస్థ రోగులకు సేవలందిస్తుండడంతో వ్యాధిగ్రస్తులు ప్రశంసిస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...