చిన్నారులతో పనులు చేయించొద్దు


Tue,March 19, 2019 03:09 AM

-కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత యజమానులదే
-జిల్లా బాలల పరిరక్షణ అధికారి కవిత
కలెక్టరేట్ : బడీడు పిల్లలతో ఎవరూ పనులు చేయించొద్దనీ, ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్.కవిత హెచ్చరించారు. బచ్‌పన్ బచావో ఆందోళన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలను ఆమె సందర్శించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రంగాపూర్, గౌరెడ్డిపేట పరిసరాల్లోని బట్టీలను తనిఖీ చేసి, అక్కడ నడుస్తున్న పాఠశాలలను పరిశీలించారు. బట్టీల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీవో కవిత మాట్లాడుతూ ఇటుక బట్టీల్లో కార్మికులుగా పని చేస్తున్న వారి పిల్లలందరికి భవిష్యత్ దృష్టా వర్క్‌సైట్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశామనీ, అందులో పిల్లలను చేర్పించి చదువు చెప్పించాల్సిన బాధ్యత యజమానులదేనని తెలిపారు. అలా చేయకుండా కార్మికులతోపాటు చదువుకునే వయసున్న కార్మికుల పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలకార్మిక చట్టం ప్రకారం ఇటుక బట్టీల నిర్వాహకులు, యజమానులంతా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బట్టీల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లల వివరాలను ఖచ్చితంగా హాజరుపట్టికలో నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, గోదావరిఖని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు రాజలింగు, గోవర్ధకి, ప్రొటెక్షన్ ఆఫీసర్ కనకరాజు, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ ఉమాదేవి పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...