నామినేషన్లకు వేళాయే


Mon,March 18, 2019 12:51 AM

-నేడు పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి నోటిఫికేషన్
-ఉదయం 10:30గంటలకు విడుదల చేయనున్న రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి, నమేస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల ఘట్టంలో భాగంగా పెద్దపల్లి స్థానానికి నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 10న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం లోక్‌సభ స్థానానాలకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పెద్దపల్లి స్థానానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీదేవసేన నేటి ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ మరుక్షణం నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 25 దాకా ప్రతి రోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న పరిశీలన, 28న ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించి మే 23న ఫలితాలు ప్రకటిస్తారు.

కలెక్టరేట్‌లో అన్ని ఏర్పాట్లు..
పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండగా, ఇందులో పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురితోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంట్ కేంద్రం పెద్దపల్లి కావడంతో పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనుండడంతోపాటు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమంతో పాటు బ్యాలెట్ పత్రాల తయారీ, ఎన్నికల కౌంటింగ్ బాధ్యతలు చూసుకుంటారు. మిగిలిన జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక్కరి చొప్పున అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. నేటి నుంచి మొదలు కానున్న నామినేషన్ల పర్వానికి పెద్దపల్లి కలెక్టరేట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేటి నుంచి అధికారులకు శిక్షణ
కలెక్టరేట్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం నుంచి ఈనెల 20 వరకు మూడురోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులకు పెద్దపల్లి మండలంలోని రంగంపల్లిలో గల సహజ స్కూల్ ఆఫ్ బిజినెస్ కళాశాలలో, మంథని నియోజకవర్గ పరిధిలోని అధికారులకు రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని జేఎన్‌టీయూహెచ్ కళాశాలలో, రామగుండం నియోజకవర్గ పరిధిలోని అధికారులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణకు వేదికలుగా నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ జరగనుంది.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...