విజయోస్తు..


Sat,March 16, 2019 01:11 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తేతెలంగాణ : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 9,370మంది విద్యార్థులు హాజరుకానుండగా, 46 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. ఈ సారి స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి విద్యాశాఖ ముందునుంచే చర్యలు చేపట్టింది. నేటి నుంచి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు 15వ స్థానం లభించగా, ఈ ఏడాది ఆ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహించారు. చదువులో వెనుకబడినవారిని గుర్తించి ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 15వ తేది నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు.

9,370 మంది విద్యార్థులు..
జిల్లాలో ఈ ఏడాది 9,370 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 4,510 మంది బాలురు కాగా, 4,860 మంది బాలికలున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి 3,715 మంది విద్యార్థులుండగా, ఇందులో 1,742 మంది బాలురు, 1,973 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ మోడల్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు 683 మంది ఉండగా, ఇందులో 271 మంది బాలురు కాగా 412 మంది బాలికలు ఉన్నారు. కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న 257 మంది బాలికలు హాజరవుతున్నారు. వివిధ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 374 మంది పరీక్షలకు హాజరవుతుండగా, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 34 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నారు. ఇక జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 4,321 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వీరందరికోసం జిల్లావ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల కోసం 44 కేంద్రాలు, ప్రైవేట్‌గా రాసేవారి కోసం రెండు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుండగా, 8 గంటల 45 నిమిషాల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలో పదో పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...