బిజీబిజీ


Fri,March 15, 2019 02:37 AM

-తొలి విడతలోనే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు
-రంగంలోకి జిల్లా అధికారులు
-ఏర్పాట్లలో తలమునకలు
-సిద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు
-పెరిగిన పోలింగ్ కేంద్రాలు..
-నిత్య సమీక్షలతో కలెక్టర్ శ్రీ దేవసేన బిజీబిజీ
-శాంతి భద్రతలు, నియమావళిపై ప్రత్యేక దృష్టి
-ఓటరు నమోదుకు నేడే ఆఖరు
-25న తుది జాబితా
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి వచ్చే నెల 11న మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీ దేవసేన పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవరించనుండగా, కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, మంథని, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఏడుగురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం, త్వరలోనే నోటిఫికేషన్ రానుండడంతో ఎన్నికల కోసం జిల్లా అధికారులు చక చకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
* సిద్ధమవుతున్న ఓటరు జాబితా..
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటరు జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ నెల 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ జాబితాను అనుబంధంగా ఈ నెల 25న ప్రకటిస్తారు. ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితా ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గంలో 14లక్షల 69వేల 56మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,36,004 మంది పురుషులు, 7,32,972 మంది మహిళలు, 80మంది మూడో రకం ఓటర్లు ఉన్నారు. ఇందులో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2,36,228 మంది, మంథని పరిధిలో 2,20,256, రామగుండం పరిధిలో 2,09,496 ఓటర్లు ఉన్నారు. ఇక ధర్మపురి 2,17,775, చెన్నూరు 1,73,863, బెల్లంపల్లి 1,63,983, మంచిర్యాల 2,47,455 మంది ఓటర్లు ఉన్నారు. 25న ప్రకటించే అడిషినల్ జాబితాలో మరిన్ని ఓట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేస్తుండగా, నేటితో నమోదుకు గడువు ముగిసిపోనున్నది.
ఈవీఎంలు సిద్ధం..
పోలింగ్ నిర్వహణకుగాను ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ఇటీవల శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చిన ఈవీఎంలు ప్రస్తుతం ఇక్కడే భద్రపరిచారు. పోలింగ్ కోసం కావాల్సిన ఈవీఎంల కంటే అదనంగా 10శాతం ఎక్కువగా అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,827 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఇందులో పట్టణ ప్రాంతాల్లో 573, గ్రామీణ ప్రాంతాల్లో 1254 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో 804 పోలింగ్ కేంద్రాలు ఉండగా పెరిగిన ఓటర్లతో ప్రస్తుతం 834 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సెప్టెంబర్ 2018 నాటికి 698 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. ఓటర్లు సైతం పెరగడంతో వారికి అనుగుణంగా కేంద్రాలు ఉండాలని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో మరో 26 అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 1370 బ్యాలెట్ యూనిట్లు, 1044 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు 1110 ఉండగా, మంచిర్యాల జిల్లాలో 1037 బ్యాలెట్ యూనిట్లు, 853 కంట్రోల్ యూనిట్లు, 892 వీవీప్యాట్లను అందుబాటులో ఉంచారు.
* కలెక్టర్ వరుస సమీక్షలు..
పార్లమెంట్ ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్నందున ఏర్పాట్ల విషయంలో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీదేవసేన అధికారులతో నిత్య సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బందితో పాటు ప్రత్యేకంగా నియమించిన అధికారులతో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు రోజుల కింద సరిహద్దు జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్‌భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు కావాల్సిన అనుమతులతో పాటు అభ్యర్థుల ఖర్చుల వివరాలు లెక్కించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తరపున సైతం సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేయడంతో పాటు మావోయిస్టు ప్రభావం ఉన్న గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...