కాళేశ్వరం మరో అద్భుతం..


Mon,February 18, 2019 02:47 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ధర్మారం : అద్భుతమైన డిజైన్‌తో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో అద్భుత నిర్మాణమని 15వ ఆర్థిక సంఘం సభ్యులు కొనియాడారు. ఇంతపెద్ద ప్రాజెక్టును అతితక్కువ సమయంలోనే పూర్తి చేయడం సర్కారు పనితీరుకు నిదర్శనమనీ, ఓవైపు సాగునీటి రంగానికి ప్రాధాన్యమిస్తూనే మత్స్య పరిశ్రమ, టూరిజం అభివృద్ధికి సర్కారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని కితాబునిచ్చారు. 15వ ఆర్థిక సంఘం తన సిఫారసులు, నివేదికను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యటనను ప్రారంభించిన నేపథ్యంలో, ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరింది. మొదటగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి, పనులు జరుగుతున్న తీరును పరిశీలించింది. అక్కడి నుంచి 6వ ప్యాకేజీ పనుల పరిశీలన కోసం బయల్దేరిన ఆర్థిక సంఘం సభ్యులు, సాయంత్రం 4.30 గంటలకు ధర్మారం మండ లం నందిమేడారం చేరుకున్నారు. వీరికి కలెక్టర్ శ్రీదేవసేనతోపాటు పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్ జ్ఞాపికలు అందించి స్వాగతం పలికారు.

హెలీప్యాడ్ నుంచి నేరుగా 6వ ప్యాకేజీ అండర్‌టన్నెల్‌కు ప్రత్యేక వాహనాల్లో చేరుకున్న ఆర్థిక సంఘం సభ్యులకు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగే లాభా లు, పను తీరును సంబంధిత అధికారులు సమగ్రంగా వివరించారు. గోదావరిలో రాష్ర్టానికి ఉన్న కేటాయింపుల నుంచి ఏడాదికి 180 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుతోపాటు 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరు అందించడం, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలతోపాటు రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నదని తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా రూ.5,046 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన 6వ ప్యాకేజీ పనులు 95 శాతం వరకు పూర్తి చేశామనీ, జూన్ 2019 నాటికి వంద శాతం పూర్తయ్యేలా శరవేగంగా పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. 6వ ప్యాకేజీలో భాగంగా అప్రోచ్ ఛానల్ ఎక్స్‌కవేషన్ గ్రావిటీ కాలువల లైనింగ్ పనులు, టన్నెల్ లైనింగ్, సర్జ్‌పూల్ పనులు, డ్రాప్ట్ ట్యూబ్స్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్లు, డెలివరీ ఛానళ్ల పనులు పూర్తి చేశామనీ, కాంక్రీట్ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ప్రతిరోజూ రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన ఏడు పంపులకు గాను, ఇప్పటికే నాలుగు పంపుల బిగింపు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.

మిగిలిన మూడు పంపుల పనులు ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, వెట్న్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జూన్ నాటికి పనులన్నీ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మూడు షిప్టుల్లో 24 గంటల పనులు సాగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన ఎలక్ట్రో మెకానికల్ పనులు, మూడు టీఎంసీల నీటిని తరలించడానికి అవసరమైన సివిల్ పనులు చేస్తున్నామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు జలాశయం వరకు నీటిని తరలించే లింక్-2 పనుల పురోగతిని కూడా ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టును రూపొందించామనీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 6వ ప్యాకేజీలో భాగంగా కాలువల్లో 10,63,117 క్యూబిక్ మీటర్ల మట్టి పని, అండర్‌గ్రౌండ్ టన్నెల్‌లో 12,91,754 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 6,44,465 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పని 2సీఎం/సీడీ పనులు, 4 పంపుల బిగింపు పనులు పూర్తి చేశామని వివరించారు. ఆర్థిక సంఘం సభ్యుల పర్యటన సందర్భంగా డీసీపీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 6వ ప్యాకేజీ పనుల పరిశీలన అనంతరం సిరిసిల్ల జిల్లా పర్యటనకు ఆర్థిక సంఘం సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు అశోక్ లహరి, రిటా లహరి, అరవింద్ మెహతా, రవి కోట, ఆంటోని సిరాయిక్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...