1.82కోట్లు


Thu,February 14, 2019 03:10 AM

-ఇది ఐదో విడత హరితహారం లక్ష్యం
-శాఖలవారీగా లక్ష్యాలు
-ఎప్పటిలాగే గ్రామీణాభివృద్ధి శాఖదే అగ్రభాగం
-1.28కోట్ల పెంపునకు కసరత్తు
-అటవీశాఖ ఆధ్వర్యంలో 54లక్షలు..
-ఊరూరా మొక్కల పెంపకానికి ప్రణాళిక
-240 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు నిర్ణయం
-ఇప్పటికే మొదలైన ప్రక్రియ
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హరిత తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో అడవి విస్తీర్ణం 33 శాతానికి పెంచి ప్రకృతి సమతుల్యతను కాపాడడంతో పాటు భవిష్యత్తు తరాలకు ప్రాణ వాయువును అందించడం హరితహారం యొక్క ఉద్దేశ్యం. హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాదిలో జిల్లాలో కోటి 82 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ పథకంలో కోటి 28 లక్షల మొక్కలు, అటవీ శాఖ ద్వారా 54 లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రతి గ్రామానికొక నర్సరీని ఏర్పాటు చేయాలని చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఈ ఏడాది హరితహారం మొక్కల కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న 263 గ్రామ పంచాయతీల పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 54 గ్రామ పంచాయతీల్లో అటవీ శాఖ ద్వారా నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 209 గ్రామ పంచాయతీల్లో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. సింగరేణి, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాల్టీలో విలీనమైన గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన గ్రామాలు 13 కాగా ఆయా గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 209 నర్సరీల నుంచి 13 గ్రామాలను తీసివేయగా, 196 గ్రామాల్లో మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 196 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ 10 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటుకు సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 186 గ్రామాల్లో మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది హరితహారం లక్ష్యం కోటి 82లక్షల మొక్కలు కాగా జిల్లా వ్యాప్తంగా 240 నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఊపందుకున్న పనులు..
హరితహారం కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం 41 రకాల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. అయితే స్థానికంగా లభించే విత్తనాలను బట్టి మొక్కలు పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో 20 రకాల మొక్కలను పెంచాలని నిర్ణయించారు. ఈ ఏడాది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కోటి 28 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యం కాగా, ఇందులో 12లక్షల టేకు మొక్కలు పెంచాలని నిర్ణయించారు. మిగిలిన కోటి 16లక్షల మొక్కల పెంపకానికి విత్తనాలను సిద్ధంగా ఉంచారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏర్పాటు చేసిన 186 నర్సరీల్లో మొక్కల పెంపకానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 183 నర్సరీలకు ఇప్పటికే ఎర్రమట్టి సరఫరా చేయగా, 184 నర్సరీల్లో మొక్కలకు కావాల్సిన నీరు పట్టడానికి నీళ్ల ట్యాంకులను ఏర్పాటు చేశారు. మొత్తం 183 నర్సరీల్లో పాలిథిన్ బ్యాగుల్లో మట్టి నింపే కార్యక్రమం సైతం పూర్తి కావస్తున్నది. ఇప్పటి వరకు 48,43,916 బ్యాగుల్లో మట్టి నింపి సిద్ధంగా ఉంచారు. ఒకట్రెండు రోజుల్లో కొన్ని నర్సరీల్లో విత్తనాలు వేయడానికి ఏర్పాట్లు సైతం చేశారు. అటవీశాఖ ద్వారా ఏర్పాటు చేయిస్తున్న 54 నర్సరీల్లో సైతం పనులు ఊపందుకున్నాయి. వచ్చే వానాకాలం నాటికి కోటి 82లక్షల మొక్కలను సిద్ధం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని నర్సరీల్లో పనులు వేగంగా నిర్వహిస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...