పనుల్లో మరింత వేగం పెంచాలి


Thu,February 14, 2019 03:06 AM

-వానాకాలం కల్లా నీరందించడమే లక్ష్యం
-మార్చిలోగా మోటార్లు బిగించాలి
-ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి
-సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్
-గోలివాడలోని సుందిళ్ల పంప్‌హౌస్ పరిశీలన
-పనుల తీరుపై సంతృప్తి
-త్వరలోనే మళ్లీ వస్తానని ప్రకటన
అంతర్గాం: పంప్‌హౌస్ పనుల్లో మరింత వేగం పెంచి, సకాలంలో పూర్తి చేయాలని సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. అంతర్గాం మండలం గోలివాడలో నిర్మిస్తున్న పంప్‌హౌస్ వద్దకు బుధవారం ఆమె ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. పంప్‌హౌస్, ప్యానల్ బోర్డు ప్రదేశాలను సుమారు గంటపాటు కలియతిరిగి పరిశీలించారు. పనుల పురోగతిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారనీ, వచ్చే వానాకాలం పంటలకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి, మార్చి చివరి నాటికి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు పూర్తి చేసి ఏప్రిల్‌లో వెటరన్ నిర్వహించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. తాను గత నెల 17న గోలివాడలో పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించాననీ, ప్రస్తుతం పనుల్లో పురోగతి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. గోలివాడ పంప్‌హౌస్ పరిధిలో నిత్యం 1500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయనీ, పనుల్లో మరింత వేగం పెంచి మార్చి చివరి నాటికి పంప్‌హౌస్ పరిధిలోని సివిల్ పనులు పూర్తి చేయాలని సూచించారు. 9 పంపులకు మోటార్ల బిగింపు ప్రక్రియను ఏప్రిల్ 20వ తేదీ వరకు పూర్తి చేసి వెటరన్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పంప్‌హౌస్ నిర్మాణంలో 9 మోటార్లకు గానూ ఇప్పటి వరకు 2 మోటార్ల బిగింపు పూర్తయిందనీ, మిగతా మోటార్ల బిగింపు పనుల్లో వేగం పెంచి మార్చి చివరి నాటికి సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు నిత్యం పనులను పర్యవేక్షిస్తూ, పురోగతిని గమనించాలన్నారు. పంప్‌హౌస్ పనులను పరిశీలించేందుకు త్వరలోనే మళ్లీ వస్తానని సూచించారు. ఆమె వెంట జేసీ వనజాదేవి, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వయిజర్ పెంటా రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, సీఈ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఈఈ విష్ణు ప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ పీవీవీఎన్ రాజ, తహసీల్దార్ మోహన్ రెడ్డి, తదితరులున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...