దరఖాస్తుల వెల్లువ


Tue,February 12, 2019 03:03 AM

- ఓటరు నమోదుకు విశేష స్పందన
- 22న సిద్ధం కానున్న జాబితా
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ కసరత్తు చేస్తున్నది. అందుకోసమే ఓటరు జాబితాలో పేరు లేనివారి నుంచి అర్జీలను ఆహ్వానించగా, జిల్లాలో విశేష స్పందన వచ్చింది. యువతీయువలతోపాటు ఎన్‌ఆర్‌ఐల నుంచి కూడా దరఖాస్తులు వెల్లువెత్తగా, ఓటరు తుది జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారయంత్రాంగం తలమునకలైంది. కొత్త ఓటర్ల నమోదుకు ఈనెల 4వ తేదీ వరకు గడువు విధించగా, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల నుంచి 52,672 మంది కొత్తగా ఓటు హక్కు కోసం అర్జీ పెట్టుకున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ 21 మంది ఎన్‌ఆర్‌ఐలు ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తులు అందించారు. ఓటరు జాబితాలో పేర్లు ఉండి 3,813 మరణించగా, విచారణ చేపట్టి పేర్లను తొలగించే పనిలో అధికారులున్నారు. తప్పుల సవరణ కోసం 8,263 దరఖాస్తులు రాగా, ఓటు బదిలీ కోసం మరో 1,395 అప్లికేషన్లు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 8,65,229 మంది. కొత్త జాబితా ప్రకారం పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 6,01,336 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు సంఖ్య 3,03,411మంది కాగా, మహిళ ఓటర్లు 2,97,854 మంది, ఇతరులు 71మంది ఉన్నారు.
పెరుగుతున్న ఓటర్ల సంఖ్య..
కలెక్టర్ శ్రీదేవసేన ప్రత్యేక చొరవతో జిల్లాలో కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా 52,672 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పెద్దపల్లిలో 15,403 మంది, రామగుండం 22,689 మంది ఉంగా, మంథని నుంచి 14,580 మంది కొత్త ఓటర్లుగా దరఖాస్తులు అందించారు.
ఫారం-6ఏ, 7, 8, 8ఏ నుంచి విరివిగా..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం - 6ఏ ద్వారా 21 మంది ఎన్‌ఆర్‌ఐలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో చనిపోయిన ఓటర్ల సంఖ్య 3,813 ఉండగా, ఇందులో రామగుండం నియోజకవర్గంలో 1,605 మంది, మంథని నియోజకవర్గంలో 1,060 మంది ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 1,148 మంది ఓటర్లు మరణించగా జాబితా నుంచి తొలగించారు. ఓటరు జాబితాలో సవరణల కోసం ఫారం-8 ద్వారా మొత్తం 8,263 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రామగుండం నియోజకవర్గం నుంచి 1,636 మంది, మంథని నియోజకవర్గం నుంచి 4,286 మంది, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 2,341 మంది అర్జీలు అందించారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటరుగా పేరు బదిలీ చేయించుకోవడానికి ఫారం-8ఏ ద్వారా మొత్తం 1,395 దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో రామగుండం నియోజకవర్గంలో 298 దరఖాస్తులు రాగా, మంథని నియోజకవర్గంలో 713, పెద్దపల్లి నియోజకవర్గంలో 384 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను ఆన్‌లైన్ చేసి, ఈనెల 22వ తేదీ వరకు తుది ఓటరు జాబితాను విడుదల చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...