‘తొలి’ విడత ప్రశాంతం


Tue,January 22, 2019 01:59 AM

-84.85శాతం పోలింగ్
-ఓటు హక్కు వినియోగించుకున్నది : 1,16,565
-మంథని మండలంలో అత్యధికంగా 89.22శాతం ఓటింగ్
-రామగిరి మండలంలో అత్యల్పంగా 81.70శాతం..
-కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్శ్రీ దేవసేన, సీపీ సత్యనారాయణ
-సోమనపల్లిలో ఒకరికి బదులు మరొకరి ఓటు
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఆరు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన 4 సర్పంచ్, 166వార్డులు పోను.. మిగతా 102 సర్పంచ్ స్థానాలు, 796 వార్డు స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ సారి గ్రామీణులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ యువకుల నుంచి పండు ముసలి వరకు పోటెత్తారు. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాల్లో, ఆ తర్వాత సర్పంచు స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటల నుంచే ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మొత్తంగా తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తొలి విడతలో 84.85 శాతం ఓటింగ్
తొలి విడతలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 84.85 పోలింగ్ నమోదు అయ్యింది. అంతర్గాం మండలంలో 81.76 శాతం పోలింగ్ నమోదు కాగా, పాలకుర్తి మండలంలో 85.25 శాతం, కమాన్ మండలంలో 83.59 శాతం, రామగిరి మండలంలో 81.70 శాతం, ముత్తారం మండలంలో 85.96 శాతం, మంథని మండలంలో 89.22 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. తొలి విడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 1,43,744 మంది ఓటర్లకు గాను 1,16,565 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 58,072 కాగా, పురుష ఓటర్లు 58,493 మంది ఉన్నారు.

మండలాల వారీగా ఓటర్ల వివరాలు
అంతర్గాం మండలంలో 11,570 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 5,864 మంది పురుషులు, 5,706 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాలకుర్తిలో 23,594 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 11,916 మంది పురుష, 11,678 మంది మహిళా ఓటర్లున్నారు. కమాన్ మండలంలో 15,414 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 7,806 మంది పురుష ఓటర్లు, 7,608 మంది మహిళలు ఉన్నారు. రామగిరి మండలంలో 24,296 మంది ఓటు వేయగా 12,168 మంది పురుషులు, 12,128 మంది మహిళా ఓటర్లున్నారు. ముత్తారం మండలంలో 15,019 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 7,406 మంది పురుష ఓటర్లు, 7,613 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంథని మండలంలో 26,672 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా ఇందులో 13,333 మంది పురుష ఓటర్లు, 13,339 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఉన్నతాధికారులు
తొలి విడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల పలు పోలింగ్ కేంద్రాలను ఉన్నతాధికారులు సందర్శించారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట, రామగిరి మండలంలోని చందనాపూర్ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పెద్దపల్లి జోన్ డీసీపీ సుదర్శన్ ముత్తారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

సోమన్ నిలిచిన ఫలితాలు..
ఎనిమిదో వార్డుకు 25న మళ్లీ రీపోలింగ్
పంచాయతీ ఎన్నికల్లో అంతర్గాం మండలం సోమన్ ఫలితాల ప్రకటన నిలిచిపోయింది. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడం కలకలం రేపింది. గ్రామంలోని ఎనిమిదో వార్డులో అసలు ఓటరుకు బదులు మరొకరు ఓటు వేయడంతో ఆ వార్డుకు ఎన్నికల అధికారులు 25న మళ్లీ పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...