‘స్వచ్ఛత’లో ముందున్నాం


Sat,January 12, 2019 03:11 AM

-ఓడీఎఫ్ ప్లస్, స్వచ్ఛ సర్వేక్షణ్ నిరంతరం కొనసాగిస్తున్నాం
-ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీ దేవసేన
-పరిశుభ్ర కార్యక్రమాలపై పవర్ ప్రజంటేషన్
-ఈసారి పెద్దపల్లిని ‘స్వచ్ఛ్ జిల్లా’గా నిలపాలని అధికారులకు సూచన
-చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశం
జ్యోతినగర్: స్వచ్ఛ్ జిల్లా సాధనే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో స్వచ్ఛ భారత్ కింద నిర్వహించిన కార్యక్రమాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కలెక్టర్ శుక్రవారం ఎన్టీపీసీ టౌన్ జ్యోతి భవన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద అధికారుల కృషితో జిల్లా వ్యాప్తంగా 100 మరుగుదొడ్లు నిర్మించి పెద్దపల్లి జిల్లాను ఓడీఎఫ్ ప్రకటించుకున్నామనీ, ఓడీఎఫ్ సుస్థిరపరిచే దిశగా మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. స్వచ్ఛత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓడీఎఫ్ ప్లస్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్త్తూనే, జిల్లాలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డేగా పరిగణించి ప్రతీ అధికారి ఒక గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొం టూ ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా కార్యక్రమాన్ని కొద్దిరోజులు వాయిదా వేశామని కలెక్టర్ ప్రతినిధులకు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో డ్రైయిన్ల అవసరం లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి సోప్ కిట్ నిర్మాణం చేపట్టామన్నారు. 98శాతం మేర పూర్తి చేశామనీ, మరో 10రోజుల్లో మిగిలిన పనులు పూర్తవుతాయని కలెక్టర్ అన్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ కింద గ్రామాల్లో పెద్ద చెత్తకుండీలు ఏర్పాటు చేశామన్నారు.

ట్రై సైకిళ్ల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. అవగాహన కోసం వాల్ పెయింటింగ్స్, బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఉపయోగించుకుంటూ స్వచ్ఛ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయినట్లు పేర్కొన్నారు. మహిళల వ్యక్తి గత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ నెలసరి సమయాల్లో తప్పనిసరిగా శానిటరీ న్యాప్ వాడేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాలకు రూ.40లక్షల వరకు పెట్టుబడి అందించి సబల అనే శానిటరీ న్యాప్ తయారు చేసి తక్కువ ధరకు సరఫరా చేస్తున్నామని కలెక్టర్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఐదు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని ఐదు గ్రామాల్లో పర్యటించారు. మంథని మండలం లక్కెపురం, ముత్తారం మండ లం అడవిరాంపేట, కమాన్ మండలం రొంపికుంట, శ్రీరాంపూర్ మండలం కూనారం, సుల్తానాబాద్ మండలంలో ప్రతినిధులు పర్యటించి గ్రామాల్లోని పారిశుధ్య పరిస్థితులను గమనించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. శనివారం వీరు ఎలిగేడు మండలం లాలపల్లి, కాచాపూర్, ధర్మారం మండలం బొట్లవనపర్తి, బొమ్మరెడ్డిపల్లి, రామగుండం మండలం ఈసాల తక్కలపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ డీఆర్డీవో ప్రేమ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం లీడర్ మంజూ భార్గవి, ప్రతినిధులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...