పల్స్ విజయవంతం చేయాలి


Sat,January 12, 2019 03:09 AM

-నులి పురుగుల నివారణపైఅవగాహన పెంచాలి
-జేసీ వనజాదేవి
కలెక్టరేట్ : శాశ్వత పోలియో నివారణ కోసం ప్రతి ఏటా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, అదే మాదిరిగా జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అందరిలో అవగాహన పెంచాలని జాయింట్ కలెక్టర్ వనజాదేవి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాలపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. పోలియో నివారణ కోసం 1995లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనీ, అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లల జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చుక్కల మందు వేయించాలన్నారు. విద్యాశాఖ, ఐకేపీ, విద్యుత్, ఐసీడీఎస్, డీపీఓ, మెడికల్, లయన్స్ ఐఎంఏ, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని 8,14,742 మందిలో 61,696 మంది ఐదేళ్ల లోపు పిల్లలున్నారనీ, వారందరికీ ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నిర్వహించే కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించాలన్నారు.

సంబంధిత అధికారులంతా ప్రజల్లో అవగాహన తీసుకువస్తూ ఇంటింటికీ తిరిగి చిన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బస్ రైల్వేస్టేషన్లలో సైతం పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. అలాగే, జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లల్లో నులి పురుగుల నివారణకు మాత్రలు మింగించాలని సూచించారు. ఫిబ్రవరి 19న, ఆగస్టు 10న జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలన్నారు. జిల్లాలో 1,94,634 మందికి పైగా ఉన్న పిల్లలకు సరిపడే మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం పల్స్ పోలియో, జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. సమావేశంలో ఇన్ డీఆర్వో కె. నర్సింహమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్ జిల్లా పంచాయతీ అధికారి వేముల సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ కృపాభాయి, రావు, అధికారులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...