ఆరో రోజు అనూహ్య స్పందన


Sun,November 18, 2018 03:26 AM

పెద్దపల్లి ప్రతినిధి/ మంథని, నమస్తే తెలంగాణ/ కలెక్టరేట్/ జ్యోతినగర్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. గత సోమవారం మొదలైన స్వీకరణ ప్రక్రియ, రేపటి మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనున్నది. మొదటి రోజు నుంచి ఐదోరోజు వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 112 నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం సెలవు రోజు కావడం, సోమవారం ప్రక్రి య ముగియనుండడంతో ఆరో రోజు శనివారం నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చారు. ఈ ఒక్కరోజే 52 మంది 56 సెట్లు దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో 22 మంది 24, పెద్దపల్లి జిల్లాలో 13 మంది 13, జగిత్యాల జిల్లాలో 11 మంది 12, సిరిసిల్ల జిల్లాలో ఆరుగురు 7 సెట్లు వేశారు. ఇందులో కరీంనగర్ నియోజకవర్గానికి 5, చొప్పదండికి 5, మానకొండూర్‌కు 6, హుజూరాబాద్‌కు 8.. పెద్దపల్లి నియోజకవర్గానికి 5, రామగుండంకు 5, మంథనికి 3.. జగిత్యాల నియోజకవర్గానికి 3, కోరుట్ల 6, ధర్మపురి 3.. సిరిసిల్ల నియోజకవర్గానికి 1, వేములవాడకు 6 చొప్పున వేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆరు రోజుల్లో 168 దాఖలు చేశారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 68 నామినేషన్లు వేశారు. ఇక సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ నియోజకవర్గంలో 13 దాఖలు చేశారు.

రామగుండం నుంచి సోమారపు దాఖలు..
రామగుండం నియోజకవర్గానికి సంబంధించి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ తన నామినేషన్ దాఖలు చేశారు. మేయర్ జాలి రాజమణితో పాటు మరి కొందరు నాయకులతో కలిసి రామగుండం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహామూర్తికి నామినేషన్ అందజేశారు. అలాగే టీజేఎస్ నుంచి గోపు ఐలయ్య యాదవ్, స్వతంత్ర అభ్యర్థులుగా బర్ల రాజేష్, కమ్మగిరి శేషయ్య, లంక అభిషేక్ వేశారు. అలాగే రెండో సారి కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్, ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్, సీపీఎం అభ్యర్థి బుర్ర తిరుపతి, స్వతంత్ర అభ్యర్థి ఇరికిల్ల రాజేశ్ సైతం వేశారు. ఇక పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా చేతి ధర్మయ్య, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ అబ్ధుల్ బారీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బొమ్మనవేని రాజు, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ అభ్యర్థిగా పొన్నాల సతీశ్, తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి ఆకుల స్వామి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి అందజేశారు. అలాగే బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా గుంటిపల్లి సమ్మయ్య, స్వతంత్ర అభ్యర్థిగా రావాడి కాంతారావు, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా నిమ్మల అశోక్ తమ రెండో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక మంథని నుంచి బీజేపీ అభ్యర్థిగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన రేండ్ల సనత్ తరుపున ఆయన తల్లి రాధమ్మ నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌బాబు తరపున సల్ల తిరుపతి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీఎస్‌పీ అభ్యర్థి ఇటుకల మహేశ్, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి పొలం రాజేందర్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెంచు నగేష్‌కు సమర్పించారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...