కాంగ్రెస్‌లో గందరగోళం


Thu,November 15, 2018 12:20 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో గందరగోళం కొనసాగుతున్నది. సీనియర్లను కాదని ఇటీవల పార్టీలోకి వచ్చిన విజయరమణారావుకు టికెట్ ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని 24గంటల్లో వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు అల్టిమేటమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం పెద్దపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయరమణ రావు, గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి నామినేషన్ వేయడంతో ఆ పార్టీలో వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మహాకూటమి సీట్ల ప్రకటన తర్వాత పెద్దపల్లి కాంగ్రెస్‌లో కలహాలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన వారిని కాదని పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలోకి వచ్చిన విజయరమణారావుకు ఇవ్వడంపై సీనియర్ నాయకులు గుస్స మీద ఉన్న సంగతి తెలిసిందే. టికెట్‌ను 24గంటల్లో వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని గొట్టె ముక్కుల సురేశ్‌రెడ్డి, సవితారెడ్డి, చేతి ధర్మయ్య పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటమ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. బుధవారం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

పార్టీ అభ్యర్థిగా జాబితాలో పేరు ఉన్న విజయరమణారావు తన నామినేషన్ వేశారు. ఇప్పటికే పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చిన సురేశ్‌రెడ్డి సైతం నామినేషన్ దాఖలు చేశా రు. అనంతరం సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే తాను నామినేషన్ వేసినట్లు ప్రకటించారు. విజయరమణారావుకు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకోవాలని పార్టీ అధిష్టానికి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గంలో సమీకరణలు మారుతాయని చెప్పారు. సురేశ్‌రెడ్డి ప్రకటనతో విజయరమణారావు వర్గం అంతర్మథనంలో పడింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సహకారం లేకుండా ఎలా ముందుకుసాగడమనే సందేహాలు విజయరమణారావు వర్గంలో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. విజయరమణారావు బుధవారం సాయంత్రం పెద్దపల్లిలో తీసిన ర్యాలీకి సైతం సురేశ్‌రెడ్డి, సవితా రెడ్డి, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య, బల్మూరి వెంకట్ అనుచరులు పాల్గొనలేదు.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...