కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..


Tue,November 13, 2018 01:33 AM

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) ఎట్టకేలకు అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమి పొత్తు నేపథ్యంలో తుదికంటా ఉత్కంఠను కొనసాగిస్తూ వచ్చిన అధిష్ఠానం, నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే (సోమవారం రాత్రి 11గంటలకు) 65 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. హుజూరాబాద్, హుస్నాబాద్, కోరుట్ల, ధర్మపురి, సిరిసిల్ల రెండో విడతలో ప్రకటించే అవకాశమున్నది. అయితే హుస్నాబాద్ సీటు మిత్రపక్షమైన సీపీఐకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది.

ఎనిమిది మంది వీరే..
తొలిజాబితాలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పేర్లను ప్రకటించింది. కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, మంథనికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాలకు టీ జీవన్‌రెడ్డి, మానకొండూర్‌కు ఆరెపల్లి మోహన్, పెద్దపల్లికి చింతకుంట విజయరమణారావు, రామగుండంకు మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, వేములవాడకు ఆది శ్రీనివాస్, చొప్పదండికి మేడిపల్లి సత్యంను ఖరారు చేసింది.

ఆశావహుల్లో అసంతృప్తి..
ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి మొదలైంది. 2014లో ఘోర పరాజయం తర్వాతి నుంచి పార్టీ ఉన్నదా? లేదా? అన్నట్లుగా మారింది. అయినా కొందరు సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఉన్నారు. వీరంతా ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా తమకే సీటు వస్తుందని ఆశపడ్డారు. కొన్నిచోట్లయితే ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారు. కానీ, నిన్నామొన్న కాంగ్రెస్‌లో చేరిన వారికి, ఎలక్షన్ల ముందర కనిపించే వారికి టికెట్లు ఇస్తారనే ప్రచారం జరగడంతో ఆందోళన చెందారు. అందుకే కొద్ది రోజుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే టికెట్లు తమకే ఇవ్వాలంటూ రోడ్డెక్కారు. అవసరమైతే రెబల్స్ దిగుతామనీ, త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ చెప్పారు. ప్రస్తుతం టికెట్ల ఖరారుతో ఆశావహులంతా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు వీరంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చగా మారింది.

-మానకొండూర్ ఎస్సీ రిజర్వుడ్ స్థానానికి మాజీ విప్ ఆరెపల్లి మోహన్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ పడినట్లు తెలుస్తున్నది. ఏడాది క్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కవ్వంపల్లి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు టికెట్ ఆరెపల్లికే కేటాయించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోననే చర్చ పార్టీలో నడుస్తున్నది.

-ఎస్సీ రిజర్వు స్థానమైన చొప్పదండికి కూడా పోటాపోటీ కనిపించింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి సుద్దాల దేవయ్యతోపాటు పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, దళిత నాయకుడు గజ్జల కాంతం సహా పది మంది వరకు టెకెట్‌ను ఆశించారు. ఏడాది క్రితమే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేడిపల్లి సత్యంను ఖరారు చేశారు. ఇప్పుడు సీనియర్ నేతలు ఆయనకు ఏ మేర సహకరిస్తారు అనేది అనుమానంగానే కనిపిస్తున్నది.

-కరీంనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ టీ సంతోష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, రేగులపాటి రమ్యారావు సహా 15 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే టికెట్ దక్కిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌కు ఆశావహులంతా ఎంత వరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

-వేములవాడ నుంచి ఏనుగు మనోహర్‌రెడ్డి బలంగా టికెట్ ఆశిస్తున్నారు. 2014లో ఓసారి భంగపడ్డారు. ఈసారి అలా జరగ కుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన వర్గీయులు కూడా ఆందోళన బాట పట్టారు. ఆదివారం ఏకంగా గాంధీ భవన్‌కు వెళ్లి నిరసన తెలిపారు. అయినా ఈసారి వేములవాడకు ఆది శ్రీనివాస్‌ను ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో మనోహర్‌రెడ్డి వర్గీయులు ఆది శ్రీనివాస్‌కు సహకరిస్తారా? అనేది అనుమానమే.

-పెద్దపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకురాలు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద రెడ్డి కోడలు సవితారెడ్డి, జూలపల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ సురేశ్‌రెడ్డి, ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర నాయకుడు బల్మూరి వెంకట్, చేతి ధర్మయ్య, పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ ఈర్ల కొమురయ్య టికెట్ ఆశించారు. ఇందులో కొందరు ఏకంగా ఢిల్లీలో మకాం వేసి ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే ఏడాది క్రితం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీ విజయరమణారావుకు టికెట్ దక్కింది. ఆశావహులంతా ఇప్పుడు అంతర్మథనంలో పడినట్లు తెలుస్తున్నది.

-పొత్తులో భాగంగా రామగుండం సీటు టీజేఎస్‌కు ఇస్తారని మొద టి నుంచీ ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు టికెట్ తమకే కావాలని ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్‌కు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ ఇక్కడ టికెట్ ఆశించారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...