మహాకూటమిని నమ్మవద్దు


Sun,November 11, 2018 05:01 AM

-టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి
- పెద్దపల్లిలో కుర్మల ఆత్మీయ సమ్మేళనం
-ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, టీఎస్‌టీఎస్‌సీ చైర్మన్ హాజరు
కలెక్టరేట్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉండగా, ఏమీ చేయలేని స్థితిలో ఉండి, ఇప్పుడేదో ఒరగబెడదామని వస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకే మహాకూటమి పేరుతో అవి జట్టుకట్టాయని టీఆర్‌ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని నందనగార్డెన్‌లో శనివారం కురుమల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ డాక్టర్ చిరుమళ్ల రాకేశ్, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు, దాసరి మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి నందనగార్డెన్ వరకు ఒగ్గు కళాకారులు, కోలాట మహిళా కళాకారులు నృత్యాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న దాసరి మనోహర్‌రెడ్డి, చిరుమళ్ల రాకేశ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టాల మల్లేశం ఒగ్గుడోలు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. ర్యాలీలో వెళ్తున్న సమయంలో దాసరి ప్రజలకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం నందనగార్డెన్‌లో జరిగిన సమావేశంలో దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆర్థికపథంలో నడిపించేందుకు కృషి చేసిందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో కూడా చేయలేదని, ఆ విషయాన్ని గమనిస్తూ మరోసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చి కారు గుర్తును గెలిపించాలన్నారు.

గొల్ల, కుర్మలకు జీవనోపాధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను అందించి ఆదుకున్నదని, అదే విశ్వాసంతో ప్రస్తుతం మీరంతా ప్రభుత్వానికి అండగా ఉండి అధికారంలోకి తీసుకువస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయని అన్నారు. టీఎస్‌టీఎస్ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేశ్ మాట్లాడుతూ.. సీఎం తెలంగాణను బహుజన తెలంగాణగా తయారు చేసేందుకు బీసీ కులాలకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే బీసీ కులాలకు సముచిత స్థానం లభిస్తుందని, ఈ క్రమంలో బీసీ వర్గాలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం బీసీ కులాలకు రుణాలు అందించేందుకు రూ. 100 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీలు ఏం చేశాయో చూసిన మీరంతా నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులు కూడా చూశారని, కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న అభివృద్ధికి ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసేందే చెబుతుందని, చెప్పిందే చేస్తుందని ఉద్ఘాటించారు.

పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎంగా కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కురుమల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న కురుమలంతా మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారని, అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో అతిథులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టాల మల్లేశం, ప్రధాన కార్యదర్శి కర్రె కుమారస్వామి, కోశాధికారి కుంట కుమారస్వామి, కడారి అంజయ్య, మధిర సదయ్య, గోవిందుల ఎల్ల స్వామి, రాయమల్లు, ఉడిగె సదయ్య, పిక్కల రాజయ్య, పెద్దోళ్ల అయిలయ్య, మల్లేశ్, గోపు సతీశ్, కుంట కుమారస్వామి, తొంటె రవీందర్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశంయాదవ్, కొయ్యడ రాజయ్య, ఉప్పు రాజు, బండారు రామ్మూర్తి, దాసరి వెంకటరమణారెడ్డి, నూనేటి కుమార్ యాదవ్, మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, గజవెళ్లి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...