40సెకన్లు.. 58ప్రాణాలు


Wed,September 12, 2018 02:15 AM

-పెద్దపల్లిలో పెను విషాదం
-దైవదర్శనానికి వెళ్లొస్తూ..
-ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి..
-అందులో ముగ్గురు పెద్దపల్లి మండలం రాంపల్లి వాసులు
-మరికొందరికీ గాయాలు
-ఘటనపై తాజామాజీ ఎమ్మెల్యే దాసరి దిగ్భ్రాంతి
-ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ
-రాత్రి స్వగ్రామానికి మృతదేహాలు
-నేడు అంత్యక్రియలకు ఏర్పాట్లు
-రాత్రి మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు..
-నేడు అత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు..
పెద్దపల్లి ప్రతినిధి / పెద్దపల్లి నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లా కొండగట్టు మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడిన ప్రమాదంలో 50మందికి పైగా మృతి చెందగా, ఇందులో జిల్లాకు చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన బొంగాని నారాయణ, బొంగాని మధునయ్య, బొంగాని వెంకటేశ్ వరుసకు అన్నదమ్ములు. వీరంతా తమ తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 8న తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్లారు. నారాయణ తన భార్య స్వప్న, కొడుకులు రాంచరణ్, పరుశురాం, తల్లి భూమక్క, కరీంనగర్‌కు చెందిన అత్త బాలసాని రాజేశ్వరి, మరో కుటుంబంలో మధునయ్య, తన భార్య మధునమ్మతోపాటు వెంకటేశ్ తన కుటుంబ సభ్యులు నలుగురితో పాటు వీరందరికీ బంధువైన ఆంజనేయులు కలిసి బయలుదేరి వెళ్లారు.

శనివారం రాంపల్లి నుంచి బయలుదేరి తొలుత సిద్దిపేట జిల్లా కొమురవెళ్లికి చేరుకున్నారు. అక్కడ ఆదివారం ఉదయం మొక్కులు తీర్చుకొని అదే రోజు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడకు వచ్చారు. మరునాడు సోమవారం రాజన్నకు మొక్కులు అప్పజెప్పి చివరగా మంగళవారం కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. ఉదయం అంజన్నను దర్శనం చేసుకొని స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. కొండగట్టు గుట్టపై బస్సు ఎక్కిన కొద్ది క్షణాల్లోనే అనుకోని ప్రమాదానికి గురికాగా, ఇందులో బొంగాని మధునయ్య (55), బొంగాని భూమక్క (65), రాంచరణ్ (10)తోపాటు వీరికి బంధువైన కరీంనగర్‌కు చెందిన రాజేశ్వరి సైతం మృతిచెందింది. ప్రమాదంలో బొంగాని నారాయణ, అతని భార్య స్వప్న, కొడుకు పరుశురాంతోపాటు మృతి చెందిన బొంగాని మధునయ్య భార్య మధునమ్మ గాయపడ్డారు. ఇందులో బొంగాని నారాయణ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరుశు రాములు, స్వప్న, మధునమ్మ కరీంనగర్‌లోని చల్మెడ ఆనంద రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి వెంట తీర్థయాత్రలకు వెళ్లిన నారాయణ అత్త కరీంనగర్ మండలంలోని చెగుర్తికి చెందిన బాలసాని రాజేశ్వరి (60) సైతం మృతి చెందింది.

-వెంకటేశ్ కుటుంబానికి తప్పిన ప్రమాదం..
రాంపల్లికి చెందిన బొంగాని నారాయణ, మధునయ్య, వెంకటేశ్ తమ కుటుంబ సభ్యులు మొత్తం 13మంది కలిసి కొమురవెళ్లి, వేములవాడ, కొండగట్టు తీర్థయాత్రలకు వెళ్లారు. కొమురవెళ్లి, వేములవాడ దర్శనం తర్వాత బొంగాని వెంకటేశ్ కుటుంబ సభ్యులు నలుగురితోపాటు అంజనేయులు వేములవాడ నుంచి రాంపల్లికి తిరిగి వచ్చారు. మిగతావారు కొండగట్టు దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నారాయణ పెద్ద కొడుకు రాంచరణ్, తల్లి భూమక్క, అత్త రాజేశ్వరి మృతి చెందగా, మధునయ్య భార్య మధునమ్మ మృతి చెందింది. వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ప్రమాదం తప్పినట్లు అయింది.

-రాంపల్లిలో విషాదం..
కొండగట్టు బస్సు ప్రమాదం పెద్దపల్లి మండలం రాంపల్లిలో విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో వీరి వెంట వెళ్లిన బాలసాని రాజేశ్వరి సైతం మృతి చెందడం గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు మృతుల ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులు కొందరు మృతదేహాలు ఉంచిన జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలివెళ్లగా, మరి కొందరు గాయపడిన వారిని పరామర్శించేందుకు కరీంనగర్ దవాఖానకు వెళ్లారు. మృతదేహాలను జగిత్యాల నుంచి రాత్రికి రాంపల్లికి తరలించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన చిదురాల సదయ్య అతని భార్య రజితలకు తీవ్రగాయాలయ్యాయి.

-తాజామాజీ ఎమ్మెల్యే సంతాపం..
కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతిచెందిన రాంపల్లి వాసులకు కుటుంబాలకు పెద్దపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంతాపం ప్రకటించడంతో పాటు సానూభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా అందుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారనీ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...