జిల్లాలో టీఆర్‌ఎస్‌దే విజయం


Wed,September 12, 2018 02:11 AM

-మూడుచోట్ల కారుదే జోరు
-పుట్ట మధుకు 50వేలకుపైగా మెజార్టీ ఖాయం
-మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జి కర్ర శ్రీహరి
మంథని, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ అఖండ విజయం సాధిస్తారని ఆ పార్టీ మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జి కర్ర శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మంథనిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాసంలో తాజా రాజకీయ పరిస్థితులపై విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ని యోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్‌చార్జీలను నియమించారని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల పొత్తులు అనైతికమైనవనీ, వారి తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇటీవల ఆయా పార్టీల నాయకులు కలిసి తిరుగుతుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్టాన్ని ఇచ్చినం అనే చెప్పుకునే కాంగ్రెస్.. 2009 తెలంగాణ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీతో ఎలా పొత్తుపెట్టుకుంటున్నదని ప్రశ్నించారు.

కాం గ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తులతో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 14ఏళ్ల పాటు ఏ విధమైన ఉద్యమాన్ని చేశారో.. అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిశలూ కృషిచేశారని వివరించారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను ఆఖండ విజయం సాధించేందుకు తోడ్పడుతాయన్నారు. దీనికితోడు మంథని నియోజకవర్గంలో పుట్ట మధుకు ప్రజలు పట్టంకట్టడం ఖాయమనీ, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు కావడంతో పాటుగా 50వేలకు పైగా మెజార్జీతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. అనంతరం పుట్ట మధు మాట్లాడుతూ.. సీనియర్ల సలహాలు, సూచనలతో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామనీ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో మరో మారు మంథని నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరేస్తామని తెలిపారు. ఇక్కడ మంథని ఎంపీపీ ఏగోళపు కమల, టీఆర్‌ఎస్ మంథని మండల పార్టీ అధ్యక్షుడు కొండా శంకర్, సింగిల్ విండో చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, పుట్ట ముఖేష్, జాగిరి సదానందం, బుర్ర మల్లికార్జున్, పుప్పాల నితిన్ ఉన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...